ఇది కదా జీవితం
ఓ రెండెకరాల పొలంపొలం సరిహద్దుల చుట్టూ సహజ సిద్దమైన గోడలా మధుర రసాలు వూరించు మామిడి చెట్లు
తీయని జలాలతో కూడిన కొబ్బరి చెట్లు
అరెకరపు పొలంలో వరి పంట
అరెకరపు పొలంలో కూరగాయల సాగు
ఎకరం పొలం మద్య భాగాన లక్ష్మి నారాయణుల ప్రతిరూపం గా ఒకదానినొకటి పెన వేసుకున్న రావి వేప చెట్లు వాటి మొదలుకు చుట్టూ చక్కగా తీర్చి దిద్దబడిన రాతి అరుగు
వాటికి కొద్ది దూరంలో ఓ చిన్ని అందమైన కుటీరం
కుటీరం చుట్టూ సువాసనలు పూయించు సుకుమార పూబాలలు మల్లెలు సన్నజాజులు
ఆ తరువాతి వరుసలో రాజసం ఒలికించు గులాభిలు
ఆ పై ముద్దొచ్చే మందారాలు ముద్దబంతులు
ఆ ప్రక్కనే సువాసనలు వెదజల్లు సంపెంగలు ఇలా పలు రకాల పూల వనం
దాని ప్రక్కగా చిన్ని చెరువు అందులో విరబూసిన తామరలు ఎగసిపడే చేప పిల్లలు
ఒడ్డున పెద్ద మారేడు వృక్షం ఆ చెట్టు నీడలో సేద తీరుతున్న రెండు కపిల వర్ణపు గోమాతలు
ఆ ప్రక్కనే చెంగు చెంగున దూకుతున్న లేగ దూడ
వేప రావి చెట్లకు సమీపంలో అందంగా తీర్చబడిన రాతి మందిరం . ఆ మందిరంలో అందమైన గోమాత విగ్రహం దానిని ఆనుకుని అందాల కృష్ణుడు చేతిలో వేణువు ప్రక్కనే రుక్మిణి మాత
ఇంత మనోహరమైన ప్రదేశంలో ఆ కుటీరంలో అమృతమూర్తి తోడుగా జీవన యానం సాగించటం
తెల్లవారు ఝామున నిదుర లేచి స్నానాదులు కావించి ఆవు పాలు సేకరించి కృష్ణ మందిరం పరిశుబ్రమ్ చేసి చక్కని సువాసనలు వెదజల్లు పూబాలలను అమృతమూర్తి తో కలసి సేకరించి తాను చక్కగా కట్టిన తులసి మాలను తీసుకుని ఆ పూలతొ తులసి మాలలతో తల్లి తండ్రులైన రుక్మిణి కృష్ణులను నా అమృతమూర్తి చక్కగా అలంకరిస్తుండగా నేను మహానుభావులు విరచించిన కీర్తనలు ఆలాపించి ఆ పై ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి
ఆ తదుపరి ఉదర పోషణార్ధం ఆవశ్యకమైన వ్యవసాయం చేయగోరి పొలంలోకి చేరుకుని పంట యోగ క్షేమాలు చూసుకుంటూ మరోప్రక్క కూరగాయల సాగు చూస్తూ సాగి పోతున్న సమయంలో ఎండ వేడిమికి చమట దారలు కక్కుచున్న వేళ వంట పని ముగించుకుని వండిన పదార్ధాలు చేబూని చెంతకు చేరిన అమృతమూర్తి తన పమిట చెంగుతో ప్రేమగా ముఖం తుడిచి భోజనానికి రమ్మన్న వేళ ఇరువురం కలసి కృష్ణుని చెంతకు చేరి ముందు కొంత పదార్ధాన్ని తల్లి తండ్రులకు నివేదించి రావి చెట్టు నీడకు చేరుకుని అమృతమూర్తి తన అమృత హస్తాలతో కొసరి కొసరి తినిపించగా తృప్తిగా త్రేంచి బడలిక తో ఒకింత సమయం అమృతమూర్తి ఒడిలో సేద తీరి తిరిగి కొంత సమయం ఇరువురం ఆ సాగు పనులలో గడిపి తిరిగి సాయం సమయానికి కుటీరం చేరుకొని తిరిగి స్నానాదులు ముగించి కృష్ణుని మందిరం చేరుకుని కొంత తడువు ఆయన పాదాల చెంత గడిపి
తిరిగి కుటీరం చేరుకుని ఆరు బయట నులక మంచం వేసుకుని కుర్చుని వుండగా అల్పాహారం చేబూని చెంతకు చేరిన అమృతమూర్తి తో కలసి కాసేపు కృష్ణుని లీలలను శ్రవణం మననం చేసుకుని ఆ తదుపరి అందమైన ఆ నీలాకాశం లో తళుకులీను తారకలను చూస్తు ఆ తారకల నడుమ పచ్చగా మెరయు చంద్రుని అందాలు ఆస్వాదిస్తూ ఆ పసిడి వెన్నల కాంతుల్లో మరింత గా బంగారు నిగారింపు తో మెరియు నా నెచ్చెలి అమృతమూర్తి తో కలసి ......................
ఆహా ఇది కదా జీవితం అర్ధ వంతమైన ఫల వంతమైన జీవితం
కృష్ణా ఈ జన్మలో నే కోల్పోయిన ఈ గొప్ప జీవితాన్ని నాకు తప్పక ప్రసాదిస్తావని నా అమృతమూర్తి తో కలసి ఆ పరిపూర్ణ మైన జీవితం గడిపి నీ పాదాల చెంతకు చేరుకునే అదృష్టాన్ని మా ఇరువురకు ఇస్తావని అచంచలమైన విశ్వాసంతో కాలం గడిపేస్తున్న
1 comment:
Post a Comment