Saturday, July 8, 2023

సింహావలోకనం

మనల్ని మనం ఆవిష్కరించుకోవాలంటే నిజాయితీ కావాలి . సత్యం చూడటానికి భగభగ మండే నిప్పు కణికలా ఉంటుంది పట్టుకున్నవాడికే తెలుస్తుంది దాని చల్లదనం మనం మహాత్మా గాంధీ ( ఇక్కడో విషయం ...గాంధీ ని విమర్శించటం నేడు సమాజంలో గొప్ప విషయంగా భావిస్తుంటారు చాలా మంది అలాంటి  నిందల జోలికి వెళ్ళకండి ) . అంత గొప్పోళ్ళం ఏమి కాదు కాబట్టి వివాదాస్పద విషయాల జోలికి పోకుండా గుర్తుకు తెచ్చుకున్నప్పుడలా మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలనే నెమరువేసుకుందాం.  వెనుతిరిగి చూస్తే  ముందుగా మదిలొకదిలేది చిన్ననాటి తూఫాన్ జ్ఞాపకాలు  నాటికి ఊరంతా రెండే డాబా ఇళ్ళు . మిగిలినవన్నీ తాటాకు కప్పులు . తుఫాను నాటి రాత్రి పక్కన ఉన్న డాబా ఇంటిలో తలదాచుకోవటం  ఎందుకో బాగా గుర్తుండిపోయింది  ఆ తరువాత మా చావిడి... అక్కడో రావి చెట్టు ..ఆ చెట్టు ఎక్కి దూకుతూ ఆడిన ఆటలు  చావిడిలో ఒకటి పెద్దరికాన్ని ఒలకబోస్తూ తెల్లగా మెరిసిపోతూ ,  ఇంకోటి  నలుపు తెలుపుల కలబోతతో చూపుల్లోనే ఉక్రోషాన్ని ప్రదర్శిస్తూ .. ఆ ఎద్దుల జంట రెంటిని చూస్తుంటే అదో తృప్తి  పచ్చని పైరందాలను చూస్తూ పొలం గట్లపై సాగిపోతూ పంట కాలవల్లో పారే నీటిని దోసిలితో తాగుతూ (ఆ నీటి రుచి తరువాతి కాలంలో ఎప్పుడు చూడలేదు మళ్ళీ చాలా కాలం తరువాత మల్లూరు లక్ష్మీ నృసింహుడి దర్శనానికి వెళ్ళినపుడు అక్కడ కొండల్లో జారే నీరు రుచి.. ఆ తీయదనం .. ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్ళేటపుడు ఒక డబ్బా తీసుకుపోండి నీళ్లు ఇంటికి తెచ్చుకుని కొన్ని రోజులు త్రాగవచ్చు.  వరంగల్ నుండి భద్రాచలం వెళ్ళేదారిలో ఏటూరునాగారం దాటాక వస్తుంది మల్లూరు  ) తిరిగిన రోజులు  మా నాయనమ్మ చేసే రోటి పచ్చడి పచ్చిమిర్చి చింతపండు కలిపిచేసే పచ్చి మిరప పచ్చడి వేడి వేడి అన్నంలో నేయి వేసుకుతింటుంటే ఆహా ఏమి రుచి   అనరా  మైమరచి ఉలవచారు లో వెన్న కలుపుకుతింటుంటే ఆ తృప్తే వేరు  మా అమ్ముమ్మ ఇంటి దగ్గర ఉన్న సీమతుమ్మ చెట్టు కాయలు లేత ఎరుపు రంగులో పంచదార తీపితో వేసవి వస్తే చాలు ఆ కాయలకోసం ఒకటే పోటీ  ఆరుబయట నులక మంచం వేసుకుని పక్కనే ఆకాశవాణి  పెట్టుకుని జనరంజని కార్యక్రమంలో తెలుగు పాటలు ఆస్వాదిస్తూ ఆకాశంలో చుక్కలు లెక్కిస్తూ నిదురలోకి జారుకున్న రాత్రిళ్ళు  చదువంటే చిరాకు . అదే తరగతులకు  సంబంధంలేని పుస్తకాలంటే తగని మక్కువ . యండమూరి , మల్లాది , సూర్యదేవర , కొమ్మూరి , మధుబాబు ,ఆర్ సంధ్యాదేవి , యద్దననపూడి , అరెకపూడి ఇలా బహుశా చదవని నవల లేదేమో అలా మా వూరి గ్రంథాలయం బాగా నచ్చిన చోటు  హిందూపురం నుండి సాగించిన రైలు ప్రయాణం నల్లమల అడవులగుండా వెన్నెల రాత్రి భోగీ తలుపు దగ్గర మెట్ల మీద కూర్చుని.. అడవి కాచిన వెన్నెలను ఆ వెన్నెల లో అడవి అందాన్ని చూస్తూ.. (ఓ రహస్యం .. రోజు వెన్నెల కాంతిలో ఒక ఇరువది నిముషాలు తిరుగాడితే మేని బంగారు వన్నె పొందుతుంది . కాణి ఖర్చు లేని సహజ ఫెయిర్ అండ్ లవ్లీ ) హిందూపురంలో ఇంటర్ చదివే రోజుల్లో కాలేజీ ప్రక్కనే  చింత వెలగ చెట్ల తోపు ఉండేది సాయంత్రాలు అందులోకి వెళ్లి వెలగ పండ్లు తింటూ పుస్తకాలు తిరగేస్తువుండేవాళ్ళం . ఆ సమయంలోనే  రోజూ  ఓ పడుచుపిల్ల పాలిటెక్నిక్ చ
దుకునేది కాలేజీ కి వచ్చి ఇంటికి వెళుతుండేది ఆ తోపులోనుండి . వెళుతూ వెళుతూ వెన్నెల జలపాతంలా ముసిముసినవ్వుల పువ్వులు విసిరి వెళుతుండేది   కాలేజీ లో ఆడపిల్లల కోసం రక్తం కారేలా కొట్టుకుంటున్న తింగరి వెధవలను చూశాక , పైగా అప్పటికే జీవితమంటే ఈ చదువులు డబ్బు సంపాదన కాదు ఇంకేదో అసలైన అర్ధం వుంది అటువైపుకు మళ్ళాలి అన్న ఆలోచన పెరుగుతున్న సమయం అందుకే ఆ నవ్వులను పలకరింపుల దాకా రానివ్వక చూపులకు మాత్రమే పరిమితం చేసితి  అందుకే అది నొప్పి కలిగించని జ్ఞాపకం లా మిగిలిపోయే    ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలు . వాటిలో కేవలం గుర్తుకు తెచ్చుకుంటే మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి  మాత్రమే పదిలపరుచుకోవాలి . ఇబ్బంది కలిగించేవాటిని మరచిపోవాలి . అపుడే గమనం ప్రశాంతగా సాగిపోతుంది 

No comments: