Tuesday, October 17, 2023
అమ్మా భవానీ
ఉదయం 3 గంటల నుంచి సుమారు 100 కి మీ దూరం నుండే రోడ్ల మీద యువకుల గుంపుల కోలాహలం
చేతిలో కాగడాలు ధరించి పరుగులు తీస్తూ కొందరు బైక్ సవారీ చేస్తూ కొందరు వారిని చూస్తూ ఆశ్చర్యపోతూ నేను
అందరి గమనం ఒకచోటకే ....... అదే ఆత్మశక్తి స్వరూపిణి భవానీ మాత కొలువైన కొండ ..తుల్జాపూర్ భవానీ క్షేత్రం
శయనముద్ర లో యోగనిద్ర లో వున్న అమ్మ భవానీ దర్శనం చేసుకుని అక్కడ నుండి పండరీపురం చేరుకున్నాం
తొలిసారి ప్రేమలో పడ్డ యువతీ యువకులు ఒకరి రూపం పట్ల మరొకరు ఎంత తన్మయ భావంతో వుంటారో
అంతలా ఎంతసేపు చూసినా ఎన్నిసార్లు చూసినా తనివితీరని రూపం మా ఇష్ట సఖుడు ఆ విఠలుడి పాదాలకు
నమస్కరించి కొల్హాపుర మహాలక్ష్మి ధామం చేరుకున్న
ఉదయం 6 . 30 కి క్యూ లైన్ లోకి చేరిన. అక్కడ క్యూ లైన్ లోకి చేరాక మనసులో పుట్టిన ఆలోచనల అక్షర రూపం
భవానీ మందిరంలో క్యూ లైన్
హైదరాబాద్ ఆర్డినరీ సిటీ బస్సుల్లో , కాలేజీ టైమింగ్స్ లో ఫుట్ బోర్డు ప్రయాణాలను మరిపించేలా
ఓ అరటి పండు, కొన్ని మురమరాలు, చుట్ట చుట్టి పడగ విప్పి వున్న పాము ను తలపించేలా వస్త్రం తో
చేయబడిన దీపపు వత్తిని కొద్దిసేపు వెలిగించి తరువాత తరువాత దాని ఆర్పి మసి అంచుతో వున్న ఆ వత్తి
వీటిని వెదురు బుట్టల్లో పెట్టుకుని ఆ వెదురు బుట్టలు నెత్తిన పెట్టి జడలు కట్టిన జుట్టుతో ముతక చీరలు కట్టి
పక్కా మాస్ అనిపించేలా తోసుకుంటూ పోతున్న స్త్రీల గుంపు
కొల్హాపూర్ క్యూలైన్
రద్దీ వున్నా అలసట తెలియనీయని హైదరాబాద్ మెట్రో ప్రయాణంలా
దివి నుండి దిగివచ్చారా అన్నట్లు పాల మీగడ వంటి మేని కాంతులతో గుబాళించే సెంటూ స్ప్రేల తో తళుకు బెళుకుల చీరలు కట్టి
పట్టుకుంటే కందిపోతాయా అనిపించే ఆ సుకుమారమైన చేతుల్లో
అప్పుడే కొన్న స్టీల్ ప్లేట్స్ లో ఓ చీర ,పూలు గాజులు పెట్టి అలవోకగా అలానడిచి వెళుతుంటే అనేక రాజ హంసల సమూహం పక్కనుండి సాగిపోతున్నట్లు
వెళ్ళింది అమ్మను చూడటానికా అమ్మాయిలను చూడటానికా అని అనుకోకండే
ఆడవాళ్ళ గురించే కానీ మగ పుంగవుల గురించి చెప్పటానికి ఏమీ లేదిక్కడ .
ద్వాపరం వరకు స్త్రీ పురుషుడిని అనుసరిస్తూ సాగింది . తగ్గట్టుగా ధర్మము వర్ధిల్లింది
కలి ... స్త్రీని అనుసరిస్తూ పురుషుడు సాగుతున్నాడు ... ఎక్కువ చర్చ చేయటం మంచిదికాదు వదిలేద్దాం
పురుషుడు జఢమ్ స్థిర స్వభావి . స్త్రీ ప్రకృతి స్వరూపిణి చలన శీలి
ప్రకృతి పురుషుడిని ఆలంబనగా చేసుకుని సాగితే అది స్థిర చలనం ఆనంద కారకం అందుకు విరుద్ధంగా జరిగితే అది దుఃఖ కారకం
భవానీ మందిరంలో క్యూ లైన్
జై జై భవానీ ... ఓ యువకుడి పెనుకేక జై జై శివాజీ .... ప్రతిగా ఓ పదిమంది యువకుల గుంపు స్పందన చెవుల్లో తుప్పు వదిలేలా
భవానీ.. అమ్మ ... ఆత్మ శక్తి ప్రతిరూపం
ఆ తల్లి ఆ ఆత్మ శక్తి ని పుణికి పుచ్చుకున్న వీర తనయుడు శివాజీ మహారాజా
ఆ యోధుడి పట్ల ఇప్పటికి మరాఠా యువతలో వున్న గాఢమైన ఆ ప్రేమ బంధం అమోఘం
కావాల్సిందల్లా వారి ఉత్సాహాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దగల సమర్ధ రామదాసు వంటి గురువు . కానీ అలాంటి యోగ్యులు ఇపుడు కరువు
మరి మన తెలుగోళ్లకు శివాజీ వంటి యోధులు లేరా.. ?శాతవాహనులు , శ్రీకృష్ణ దేవరాయలు ... వీరి పట్ల మనకున్న గౌరవభావం ఏపాటిది
కొల్హాపూర్ క్యూలైన్
వచ్చింది అమ్మ దర్శనానికీ చేస్తుంది ఐఫోన్స్ లో సాంగ్స్ వింటూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ క్రికెట్ చూస్తూ....
ఒకరివెనుక ఒకరు బుద్ధిమంతుల్లా తలలు ఫోనుల్లో పెట్టి అలా సాగిపోతూ.. ధనం మూలం ఇదం జగత్ అన్నదానికి నిదర్శనంలా
ఆహా భవానీ మాత ఆ తల్లికి తగ్గట్టుగానే అక్కడి భక్త సమూహం కొల్హాపూర్ మహాలక్ష్మి ఈ తల్లికి తగ్గట్టుగా ఇక్కడి భక్త జనం
ఇవన్నీ కాదు కానీ
ఓ వైపు శక్తి స్వరూపిణి కాళికామాత
మరోవైపు జ్ఞాన స్వరూపిణి సరస్వతి మాత
నడుమ ఐశ్వర్య ప్రదాయిని అమ్మ మహాలక్ష్మి
ఆ కొల్హాపుర ధామ వైభవం అద్భుతం
మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ: విశ్వమంగళం
Thursday, July 27, 2023
వానాకాలం నాడు నేడు
ఆకాశపు చెలికాడు చిటపట చినుకులు రాలుస్తుంటే
సూరీడి చురుక్కు చూపులతో వేడెక్కి వేదన పడుతున్
న భూకాంత ఎద చెమ్మగిల్లి వెలువరించే గంధపుగాలుల
ఆస్వాదన లో నా మేని పులకరించే నాడు
ఎండ వేడిమికి పుడమి ఎండి వానొచ్చే సమయమొచ్చిన
చినుకురాలక రైతు గుండె ఎండి ఇరువురి వేదన వరదలై
నిలువ నీడలేక ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణుల చూచి
మనసు మూగపోయే నేడు
ఇంటి చురుల జాలువారి కాలువ కట్టిన వాననీటిలో
కాగితపు పడవనెక్కి వేయించిన కారపు వేరుశనగ గుళ్లను
గుటుక్కుమనిపిస్తూ పక్కింటి పాప చేయి పట్టి చిందులేసి
మురిసిపోతి నాడు
రహదారులలో ధార లా పారుతున్న జలధారలో పొంగిపొరల
ుమురుగులో తెలియని దారులలో మరపడవల పై తాపోజాలక
పక్కనోడినీ పోనీయక చిరాకు సణుగులు తింటూ సాగిపోయే
అయోమయపు జీవుల చూచి జాలిచెందితి నేడు
Saturday, July 8, 2023
సింహావలోకనం
మనల్ని మనం ఆవిష్కరించుకోవాలంటే నిజాయితీ కావాలి . సత్యం చూడటానికి భగభగ మండే నిప్పు కణికలా ఉంటుంది పట్టుకున్నవాడికే తెలుస్తుంది దాని చల్లదనం మనం మహాత్మా గాంధీ ( ఇక్కడో విషయం ...గాంధీ ని విమర్శించటం నేడు సమాజంలో గొప్ప విషయంగా భావిస్తుంటారు చాలా మంది అలాంటి నిందల జోలికి వెళ్ళకండి ) . అంత గొప్పోళ్ళం ఏమి కాదు కాబట్టి వివాదాస్పద విషయాల జోలికి పోకుండా గుర్తుకు తెచ్చుకున్నప్పుడలా మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలనే నెమరువేసుకుందాం.
వెనుతిరిగి చూస్తే ముందుగా మదిలొకదిలేది చిన్ననాటి తూఫాన్ జ్ఞాపకాలు
నాటికి ఊరంతా రెండే డాబా ఇళ్ళు . మిగిలినవన్నీ తాటాకు కప్పులు . తుఫాను నాటి రాత్రి పక్కన ఉన్న డాబా ఇంటిలో తలదాచుకోవటం ఎందుకో బాగా గుర్తుండిపోయింది
ఆ తరువాత మా చావిడి... అక్కడో రావి చెట్టు ..ఆ చెట్టు ఎక్కి దూకుతూ ఆడిన ఆటలు
చావిడిలో ఒకటి పెద్దరికాన్ని ఒలకబోస్తూ తెల్లగా మెరిసిపోతూ , ఇంకోటి నలుపు తెలుపుల కలబోతతో చూపుల్లోనే ఉక్రోషాన్ని ప్రదర్శిస్తూ .. ఆ ఎద్దుల జంట రెంటిని చూస్తుంటే అదో తృప్తి
పచ్చని పైరందాలను చూస్తూ పొలం గట్లపై సాగిపోతూ పంట కాలవల్లో పారే నీటిని దోసిలితో తాగుతూ (ఆ నీటి రుచి తరువాతి కాలంలో ఎప్పుడు చూడలేదు మళ్ళీ చాలా కాలం తరువాత మల్లూరు లక్ష్మీ నృసింహుడి దర్శనానికి వెళ్ళినపుడు అక్కడ కొండల్లో జారే నీరు రుచి.. ఆ తీయదనం .. ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్ళేటపుడు ఒక డబ్బా తీసుకుపోండి నీళ్లు ఇంటికి తెచ్చుకుని కొన్ని రోజులు త్రాగవచ్చు. వరంగల్ నుండి భద్రాచలం వెళ్ళేదారిలో ఏటూరునాగారం దాటాక వస్తుంది మల్లూరు ) తిరిగిన రోజులు
మా నాయనమ్మ చేసే రోటి పచ్చడి పచ్చిమిర్చి చింతపండు కలిపిచేసే పచ్చి మిరప పచ్చడి వేడి వేడి అన్నంలో నేయి వేసుకుతింటుంటే ఆహా ఏమి రుచి అనరా మైమరచి ఉలవచారు లో వెన్న కలుపుకుతింటుంటే ఆ తృప్తే వేరు
మా అమ్ముమ్మ ఇంటి దగ్గర ఉన్న సీమతుమ్మ చెట్టు కాయలు లేత ఎరుపు రంగులో పంచదార తీపితో వేసవి వస్తే చాలు ఆ కాయలకోసం ఒకటే పోటీ
ఆరుబయట నులక మంచం వేసుకుని పక్కనే ఆకాశవాణి పెట్టుకుని జనరంజని కార్యక్రమంలో తెలుగు పాటలు ఆస్వాదిస్తూ ఆకాశంలో చుక్కలు లెక్కిస్తూ నిదురలోకి జారుకున్న రాత్రిళ్ళు
చదువంటే చిరాకు . అదే తరగతులకు సంబంధంలేని పుస్తకాలంటే తగని మక్కువ . యండమూరి , మల్లాది , సూర్యదేవర , కొమ్మూరి , మధుబాబు ,ఆర్ సంధ్యాదేవి , యద్దననపూడి , అరెకపూడి ఇలా బహుశా చదవని నవల లేదేమో అలా మా వూరి గ్రంథాలయం బాగా నచ్చిన చోటు
హిందూపురం నుండి సాగించిన రైలు ప్రయాణం నల్లమల అడవులగుండా వెన్నెల రాత్రి భోగీ తలుపు దగ్గర మెట్ల మీద కూర్చుని.. అడవి కాచిన వెన్నెలను ఆ వెన్నెల లో అడవి అందాన్ని చూస్తూ.. (ఓ రహస్యం .. రోజు వెన్నెల కాంతిలో ఒక ఇరువది నిముషాలు తిరుగాడితే మేని బంగారు వన్నె పొందుతుంది . కాణి ఖర్చు లేని సహజ ఫెయిర్ అండ్ లవ్లీ )
హిందూపురంలో ఇంటర్ చదివే రోజుల్లో కాలేజీ ప్రక్కనే చింత వెలగ చెట్ల తోపు ఉండేది సాయంత్రాలు అందులోకి వెళ్లి వెలగ పండ్లు తింటూ పుస్తకాలు తిరగేస్తువుండేవాళ్ళం . ఆ సమయంలోనే రోజూ ఓ పడుచుపిల్ల పాలిటెక్నిక్ చదుకునేది కాలేజీ కి వచ్చి ఇంటికి వెళుతుండేది ఆ తోపులోనుండి . వెళుతూ వెళుతూ వెన్నెల జలపాతంలా ముసిముసినవ్వుల పువ్వులు విసిరి వెళుతుండేది
కాలేజీ లో ఆడపిల్లల కోసం రక్తం కారేలా కొట్టుకుంటున్న తింగరి వెధవలను చూశాక , పైగా అప్పటికే జీవితమంటే ఈ చదువులు డబ్బు సంపాదన కాదు ఇంకేదో అసలైన అర్ధం వుంది అటువైపుకు మళ్ళాలి అన్న ఆలోచన పెరుగుతున్న సమయం అందుకే ఆ నవ్వులను పలకరింపుల దాకా రానివ్వక చూపులకు మాత్రమే పరిమితం చేసితి అందుకే అది నొప్పి కలిగించని జ్ఞాపకం లా మిగిలిపోయే
ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలు . వాటిలో కేవలం గుర్తుకు తెచ్చుకుంటే మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి మాత్రమే పదిలపరుచుకోవాలి . ఇబ్బంది కలిగించేవాటిని మరచిపోవాలి . అపుడే గమనం ప్రశాంతగా సాగిపోతుంది
Friday, July 7, 2023
అర్ధశత వసంతాలు
అర్ధశత వసంతాలు అనగానే రాతి కట్టడాలకు ప్రాణం లేని సంస్థలకు గోల్డెన్ జూబ్లీ అంటూ ఉత్సవాలు చేస్తారు
అదే మనిషి పూర్తి చేసుకుంటే పెద్దవాడివైపోతున్నావంటూ ముసలితనానికి చేరువవుతున్నట్లు చులకన
కట్టడాలు సంస్థలు పాతబడుతున్నా అందులోకి ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తుంటారు
అలాగే శరీరం పాతబడుతున్నా లోపలి మనసు నిత్య యవ్వన రసోద్వేగహేల లో తెలియాడుతూనే వుంటుదిగా
ఆలోచనల ప్రవాహమూ ఎప్పుడూ కొత్తగానే ఉంటుందిగా . నిన్నటి ఆలోచన ఈరోజువుండదు ఈనాటి ఆలోచన రేపటికి నిలవదు
అర్ధశత శరత్కాల పూర్ణచంద్రోదయాలను చూసిన వయసు గర్విద్దాం రాబోయే కాలాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
గడచిన కాలపు స్మృతులను నెమరువేసుకుంటూ భవిష్యద్ గమనంలోకి సాగిపోదాం ఓసారి వెనుతిరిగి ఇన్నేళ్ల జీవితకాలంలో
సంపాదించినదేమిటని ఆలోకనం చేస్తే ...
ప్రతి మనిషికి జీవన గమనాన్ని నిర్ధేశించటానికి ఓ సద్గురు అత్యావశ్యకం . కానీ ఈ కాలంలో సద్గురువులు దొరకటం దుర్లభం .
మరి ఎలా .. ఈ అన్వేషణలో నే అర్ధం చేసుకున్నది... మన జీవితమే మన గురువు . అంతకు మించిన గురువు లేరుగాక లేరు
ప్రతి రోజూ మన జీవితం సాగుతున్న విధానాన్ని పరిశీలంచుకుంటే అది నేర్పని పాఠం లేదు .
ఆ పాఠాన్ని వంటబట్టించుకుని తగిన మార్పులు చేసుకుంటూ ముందుకుసాగితే అంతకుమించి కావాల్సింది ఏమి లేదు
అలాగే జీవితం నిర్మల నదీతుంగా ప్రవాహంలా ప్రశాంతంగా సాగిపోవాలంటే మనిషి వినయ స్వభావం అలంకారంగా చేసుకోవాలి
ఎవరు సహనశీలత కలిగివుంటారో వారే వినయవంతులు కాగలరు
సహన స్వభావం వుండాలంటే మనిషికి సరి అయిన జ్ఞానం కలిగివుండాలి జ్ఞానం అబ్బాలంటే శ్రద్ద ఆవశ్యకం . ఎవరు శ్రద్ధాళువో
వాడే జ్ఞానవంతుడు కాగలడు
ఇన్నాళ్లకు నాకు కలిగిన జ్ఞానోదయం ఇది . శ్రద్ద వినయం జీవన గమనమనే గురువు ఈ మూడు కలిగివున్నవాడే ఐశ్వర్యవంతుడు
వాడే జీవితాన్ని పూర్ణంగా అనుభవించగలడు
ఇకనైనా ఈ మూడింటితో నాజీవితాన్ని పరిపుష్టం చేసుకోవటమే యాభైయ్యేవొడి చేరువలో నే నిర్ధేశించుకున్న గమ్యం
Monday, March 20, 2023
పిల్లలు
పిల్లలు
మల్లెల పరిమళాలు వెదజల్లు పక్క పక్క కాదు
పసిపాపల మూత్రం తో తడిసినదే పక్క కాని.... ఆర్యోక్తి
అది ఇంట పిల్లల కుండే ప్రాధాన్యత
బహుశా శ్రీరాముడను పేర నరుడిగా నడయాడిన నారాయణుడు సైతం
బాల విన్యాసాలలోని మధురానుభూతి తెలసి తిరిగి కృష్ణుడిగా దిగి వచ్చి
బాల్యంలోని మాధుర్యాన్ని అనుభవించిన వైనం వర్ణించనలవి కానట్టిది
అజ్ఞాని నైన నాకే అపుడపుడు సాలోచనగా పరికిస్తే సాయం సంధ్యలో
చెంగు చెంగున ఎగురుతూ , తటాలున ఆగుతూ కేరింతలతో సాగి పోవు
గోవత్సముల పద ఘట్టనలో రేగిన ఎర్రని ధూళి దట్టమైన వాన మబ్బు వంటి దేహచ్చాయను
కమ్ముకొనగా ఓ వింత ఎర్రని కాంతితో మెరయు, పసుపు పచ్చని పంచె కట్టి నడుముకు
బిగించిన తలపాగాలో వేణువు దూర్చి , తలపై నెమలి పించం అలంకరించి గోపబాలుర చేతులతో చేతులు కలిపి నడయాడు గోపాల బాల కృష్ణుని రూపం అబ్బ ఎంత ముద్దోస్తుందో ..........
ఇక సుజ్ఞానులైతే ఎంత గొప్పగా దర్శించి పులకించిపొయారొ పోతన గారి భాగవతం
లీలాశుకుల కృష్ణ కర్ణామృతం లాంటివి చూస్తే తెలుస్తుంది
అందుకే అంటారు భగవానుడు శిశువులలో తేజిల్లుతుంటాడని
అలాంటి బాలకుడొకడు నట్టింట పారాడుచుండగా చూసిన తండ్రి హృదయం
పొంగి పోతుంది
లేలేత తమలపాకు వంటి చిన్ని పాదాలతో గుండెలపై తన్నుతుంటే కలిగే తదాత్మ్యత సరిపోక
ముఖం మీదకు చేర్చుకుంటాడు పాదాలను అక్కడ కూడ తన్నమని
మరి అంతగా మురిపించే ముద్దు బాలకుడొకడు వుండాలని అందరు తపిస్తుంటే
నాకెందుకు ఆ ఆలోచన కూడా స్పురించదు
నేను జడుడనా ! నాకు స్పందనలు లేవా ?
ఆలి గగ్గోలు పెడుతున్నా, పెద్దలు పోరు పెడుతున్న
చెల్లి పనికట్టుకు ప్రశ్నిస్తున్న చిరకాల మిత్రుడు పదే పదే రొద పెడుతున్న
నాకెందుకు లేరు అన్న చింత కాని ఇక రారా అన్న ఆందోళన కాని మనసును తాకటం లేదు
అది బండ బారిందా లేక వివేకమెరుగని మూర్ఖపు స్థితిలో నేనున్నానా
ఆలోచనలు స్వయంకల్పితాలు వాటిని మనిషి సృజించలేడు
ఆవి ఆత్మచే సంకల్పించ బడతాయి ఆత్మ భగవత్ స్వరూపం
ఇదే విషయం వెంకటరామన్ గా పిలవబడి శరీరపు కదలికలు ఆగిన స్థితిలో కూడా
ఆలోచనలు ప్రసరించటం స్వయంగా అనుభవించి ఆత్మ వేరు శరీరం వేరు అని గ్రహించి
భగవాన్ రమణులుగా ప్రసిద్దులైన రమణ మహర్షి జీవితం మనకు తెలియ చేస్తుంది
అదే అనుభూతిని నేను రెండు సార్లు పొందాను . శరీరం పూర్తిగా చచ్చుబడి అణుమాత్రమైన కదపలేని స్థితిలో ...... నా మనసు మరణం సమీపిస్తున్నదా అని తనను తానూ ప్రశ్నించుకుని శ్రీరామ నామాన్ని స్మరించిన సందర్బం రెండు సార్లు అనుభవించాను
మరి నేనెందుకు అటు రమణుల వలే గొప్పగా ఆలోచించి ఉన్నత స్థితిని పొందలేకపోయాను
మరి అలాంటి స్థితి అనారోగ్యం వల్ల కలిగిందా అయితే నొప్పిని అనుభవించాల్సిన స్థితిలో
రామ నామ స్పురణ ఎలా కలిగింది
ఇంతటి ఆలోచనలు కలిగించే నారాయణుడు పిల్లలు గూర్చిన కనీసపు ఆలోచన కూడా
నాలో ఎందుకు రేకెత్తించటం లేదు
అంటే పూర్వ జన్మ వాసనా బలం ఏదైనా నను వెన్నాడుతుందా
అప్పటి పాపఫలం ఇప్పుడు ఈ రీతిన బదులు తీర్చుకుంటున్దా
కాదు అనుకుంటే ఒకే ఇంట జన్మించిన ముగ్గురు కు చెందిన సంతానంలో ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు గా సంతాన లేమి తో సతమతమవటం కాకతాళీయమా యాద్రుశ్చికమా
మరి ఇటువంటి స్థితిని నరుడైన వైద్యుడు తప్పించగలడా (మిగిలిన ఇద్దరు ఎందుకు ఇంకా ఫలితం పొందలేకపోయారు)
వైద్యో నారాయణో హరి మరి నారాయణుడే తప్పించాగాలడా మరి అందుకు ఆయన సంకల్పిస్తాడా
ఒక వేళ పిల్లలు పిల్లలన్నను వారికి సంక్రమించే ఆలోచనా స్థితి లేదా ఆరోగ్యం మన నుండి రావాల్సిందే కదా
అంటే సోమరితనం చిరాకు ఇటువంటి లక్షణాలతో పుట్టే వాడు తనను తాను ఉద్దరించుకొగలడా
మనకు సంతోషాన్ని ఇవ్వగలడా
ఏమో నాకేమి పాలు పోనీ స్థితి ఎటు వైపుకు నా పయనం .....
ఏమిటి నా ముందున్న కర్తవ్యమ్ .......
దామోదరుడా నీదే భారమిక
గుండెలపై సుతిమెత్తగా తన్నినా గుండె పోటు తెప్పించినా గురువాయూరప్ప
త్వమేవ శరణం మమ శంఖపాణే
Subscribe to:
Posts (Atom)