Saturday, September 12, 2020
కార్తీక పున్నమి ... తూరుపు కాంత నుదిటిన అద్దిన కుంకుమ బొట్టులా
ఆకాశ కాంత కు కాచిన ఎర్రని పండులా అగుపించి క్రమేపి పక్వ దశను
దాటి పండిన పండులా పసిమి ఛాయలు సంతరించుకుని మేఘ మండలము
అలంకరించుకున్న పసిడి పాపిట బిళ్ల లా తన వెండి వెలుగులతో భూకాంత
ను చందురుడు ప్రకాశింప చేయు వేళ
చిరుగాలి తాకిడికి కదులాడుతున్న నల్లని పొడుగాటి కురుల ప్రవాహంలా మృదు మదుర సవ్వడులతో సాగిపోతున్న యమునా తీరాన చందనపు పొడిరేణువులా అని మరిపించే విధంగా పరుచుకున్న ఇసుక తిన్నెలు
సమీపాన సువాసనలు వెదజల్లెడి పూలతలతో మనోహరమగు లావణ్యముతో ఒప్పారురంగు రంగుల పూల మొక్కలతో మధుర రసాలు స్రవించు ఫలాలతో నిండిన వృక్షాలతో కూడిన బృందావని
గండు తుమ్మెదల ఝుంకారాలతో , పూబాల ల పరిమళాలను , పండిన ఫలాల యొక్క తీయదనాన్ని తనలో నింపుకుని ఆహ్లాదకరం గా మెల్లగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు
అట్టి ఆ బృందావని లో ఓ మందార చెట్టు కింద ఎడమ పాదపు ఎడమ భాగాన కుడి పాదపు ముని వేళ్ళను నేలకు తాకించి కుడి పాదపు వెనుక భాగాన్ని పైకి ఎత్తి నుంచున్న భంగిమలో ఓ స్ఫురద్రూపిదట్టమైన వానమబ్బు రంగు దేహ కాంతి తో , తలపై నెమలి ఫించం ధరించి , నుదిటిపై
కస్తూరి తిలకం అద్ది , నాసిక పై భాగాన తెల్లని ముత్యమొకటి మెరయుచుండగా పారిజాత సుమ మాలను మెడలో ధరించి ఆకు పచ్చని రత్నాల ఉత్తరీయాన్ని భుజాలపై వేసుకుని కస్తూరి చందనపు పూతతో నిండిన దేహంతో ఒంపుగా నిలబడి పున్నమి పసిడి కాంతులు ఆ దేహాన్ని తాకి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తుండగా
ఎర్రని దొండ పండు వంటి పెదవులపై రెండు అరచేతులతో ఒడుపుగా పట్టిన వేణువు నుంచి సుతారంగా ప్రాణులన్నిటికి ప్రాణాధారమైన వాయువును తన పెదవుల గుండా ఆ వేణువులోకి మృదువుగా పంపుతుంటే వేణువు నుండి బయటకు వస్తున్న ఆ వాయు తరంగాలు మధురమైన ధ్వనులుగా మారి ఆ ప్రాంతమంతా ఆవరిస్తున్నాయి అతి మధురమైన ఆ ధ్వనులకు ప్రకృతి పరవశించిపోతుండగా ఆ వేణు నాద తరంగాలు
మెల్లగా గోపకులాన్ని తాకాయి ఆ గోపకులంలో నవ యవ్వనంతో తొణికిసలాడే గోపకాంతల సమూహాలు ......అందులో
కొందరు గోపికలు తమ చీర సొబగుల సౌందర్యాన్ని ఇతర గోపికలతో పంచుకు మురిసిపోతుంటేమరి కొందరు తమ ఆభరణాల తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ, మరి కొందరు తమ చేతి కంకణముల సవ్వడులతోను ఇంకొందరు కాలి అందియల సవ్వడులతోను మరి కొంత మంది గోపికలు కోలాటపు సవ్వడులతోను సందడి చేస్తుండగా మరి కొందరు ముగ్ధలు తమ గాన కౌశలంతో ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నారు .ఇంకొందరు ఇంటి పనులలో నిమగ్నులై ఉన్నారు . అట్టి ఆ గోపకాంతల సమూహపు చెవులను ఆ వేణు నాద తరంగాలు చేరగనే ఒక్కసారిగా వారిలో వూహించని మార్పు . తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని మరచి తామున్న స్థితిని మరచి ఒక్క ఉదుటున పరుగు పరుగున ఆ వేణువు తరంగాలు జనిస్తున్న ఆ వృందావనిలోకి చేరుకున్నారు
అక్కడ ఆ మందారపు చెట్టుకింద తమ కలల రేడు , భావించిన మాత్రం చేతనే హృదయాలలో గొప్పదైన ఆనందాన్ని పొంగించేవాడు సాక్షాత్ పర బ్రహ్మమే తానైనట్టివాఁడు
అగు ఆ యశోదా నందనుడు గోకుల కిశోరం శ్రీకృష్ణుని మనోజ్ఞమైన దివ్య మంగళ రూపాన్ని చూచి పులకితులై తమను తాము పరిపూర్ణంగా ఆనంద స్వరూపుడగు ఆ పరంధామునకు సమర్పించుకోటానికి సంసిద్దులయ్యారు ఆ అమాయకపు పల్లె పడుచులు నిష్కళంకమైన నిర్మల జ్ఞానానికి ప్రతిరూపాలైన ఆ గోపకాంతలతో రాసలీలకు ఉద్యుక్తుడయ్యాడు అందరి హృదయాలలో ఆత్మగా ప్రకాశించు ఆ పరమాత్మ
రాస లీల ఇది రెండు మహోన్నత భావాల (మాతృత్వము +పోషకత్వము=వాత్సల్యము ) కలయిక . రెండు దేహాల కలయిక కాదు
తొమ్మిది రంధ్రాలతో కూడి తొమ్మిది రకాల మలపదార్ధాలతో నిండిన దేహాల కలయిక ఎలాంటి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు
చైతన్యం మాతృత్వం పోషకత్వం లాలిత్యం సౌందర్యం ఈ భావాల పరస్పర కలయికే రాసలీల అట్టి రాసలీల మానసిక దర్శనం దుఃఖ స్పర్శలేని సుఖానుభూతినిస్తుంది అది నిజమైన రసానుభూతి
కలిగిస్తుంది . రాసం అంటేనే గొప్పదైన ఆనందపు అనుభూతి అని అర్ధం . ఆ ఆనందానికి అవధులు వుండవు . అట్టి దివ్యమైన ఆనంద స్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణునితో సమాగమం కోరటమంటేనే ఎల్లలు లేని దుఃఖ స్పర్శ లేని పరిపూర్ణ ఆనందానుభూతి
తో మమేకమవటమే . అదే మానవ జీవిత పరమార్ధం అందుకోసమే అత్యంత దుర్లభమైన మానవ జన్మ మనకు లభిస్తుంది మనుషులు తాము తమ కోరికలు నెరవేర్చుకోవటంద్వారా ఆనందం పొందుతున్నామని భ్రమలో వుంటారు . నిజానికి వారు పొందే ఆనందాలు తాత్కాలికమే కాక వాటి ఫలితం దుఃఖ స్పర్శతో కూడి వుంటుంధి ఆ గోపికలు ఇహ పరాలను కాదనుకుని కేవలం పరమాత్మ తో సౌఖ్యాన్ని మాత్రమే కోరుకున్నారు వారికి ఇతరములైన ఏ లోక విషయాలయందు వారికి ఆసక్తి లేదు. వారి అనురక్తి యందు పరమాత్మ యందు మాత్రమే
భయము చేత కంసుడు , భక్తి చేత ప్రహ్లాదుడు , స్నేహం చేత అర్జునుడు, సుదాముడు , ఉద్ధవుడు
శత్రుత్వం చేత రావణ కుంభకర్ణ శిశుపాలుడు , కామం చేత గోపికలు ఆ పరమాత్మ ను పరిపూర్ణం గా తమలో నిలుపుకున్నారు . ఆ పరంధాముడి ధామాన్ని చేరుకున్నారు మనం కూడా భగవానుడి పట్ల స్వచ్ఛమైన భక్తి భావమో స్నేహ భావమో పెంచుకుని శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం
Monday, August 10, 2020
అలల ఒడిలో
జీవితంలో మొదటిసారి అయ్యో అనిపించింది చదువులో సాధించిన మార్కుల విషయంలో వాటి గురించి ఆలోచించటం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా
డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక , మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లో వంద మార్కులు వచ్చాక ,కాస్ట్ అకౌంటెన్సీ లో కూడా వంద వస్తాయనుకున్న తీరా చూస్తే 80 మాత్రమే వచ్చాయి మొదటిసారి మనసు చివుక్కుమంది ఏమైయ్యుంటుంది వ్రాసిన కాస్ట్ అకౌంటెన్సీ పేపర్ ఓసారి జ్ఞాపకం చేసుకుంటే , ఆరోజు ఎదో బాలయ్య మూవీ కి వెళ్లాలన్న హడావుడి లో సమయం ఇంకా చాలా మిగిలి వుండగానే ఆన్సర్ పేపర్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవటం తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తే ప్రాసెస్ కాస్టింగ్ లో ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కి ఓపెనింగ్ బాలన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం మరచితిమి వెంటనే పెదవులపై ఒక చిరునవ్వు . మనసులోని దిగులు మటుమాయం చదువుల కాలం ముగిసింది. జీవితపు పరీక్షా కాలం మొదలైంది
గుంటూరు లోనే ఆడిటర్ పున్నయ్య చౌదరి గారి ఆఫీస్ లో చేరటం , ఆడిట్ పనుల మీద ఊళ్ళు పట్టుకు తిరగటం
ఆ క్రమంలో మొదటిసారి హైదరాబాద్ రావటం జరిగింది . నాతో వుండే సీనియర్ మిత్రుడు సాయంత్రం అవ్వగానే ట్యాంకుబండ్ వద్దకు తీసుకు వచ్చేవాడు . అక్కడ వీచే మురికి గాలుల వాసనకు ముక్కులు ఉక్కిరి బిక్కిరి ఐతే , ఆ ప్రాంతం చుట్టూ షికారుకు తిరిగే మనుషులను చూసి మనసు ఉక్కిరి బిక్కిరి అయ్యింది అపుడే నిర్ణయించా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రాకూడదని . (హతవిధీ! భగవానుడు తన్నిన తన్నుకు ఎగిరొచ్చిపడి భాగ్యనగరంలో పడితి )
అక్కడ షికారు ముగియగానే చిక్కడపల్లి లో కమ్మని భోజనం ఆరగించి అటునుండి ఆటే మహేశ్వరీ థియేటర్ కి ...... దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే భాష రాదు కానీ అద్భుతంగా నటించిన షారుఖ్ కాజోల్ ల ఉత్సాహభరితమైన ప్రణయగీతం వరుసగా ఏడురోజులు సెకండ్ షో కి వెళ్ళటం ఇసుమంతైనా విసుగనిపించకపోవటం
ఆ తరువాత పయనం విశాఖపట్టణం . ఆఫీస్ పని ముగియగానే సాయంత్రాలు సాగర తీరంలో ఇసుక తిన్నెలపై సేద తీరుతూ ఎగసి పడే అలలు చూస్తూ వేడి వేడి మిక్చర్ ఆరగిస్తూ, నిశీధివేళ సముద్రుడి ఘోష హృదయంలో సుడులు తిరుగుతుంటే వచ్చే కిక్కు ఏ ఆర్ రహ్మాన్ బీట్ ఇస్తుందా ఇళయరాజా సంగీతమిస్తుందా చేతిలోని ఐస్ క్రీం కరిగిపోతుంది కాళ్ళ కింద ఇసుక అలల తాకిడికి కదిలిపోతుంది కాలం గడచిపోతుంది కానీ సముద్రుడి ఘోషలో లీనమైన మనస్సు మాత్రం వెనుకకు రాదు అదే సముద్రుడి గొప్పతనం ఆర్కే బీచ్ రోడ్ నుండి ఋషి కొండ మీదుగా సాగర తీరం వెంబడి భీమిలి బీచ్ వరకు ఉల్లాసంగాబైక్ మీద సాగిపోతుంటే అదొ సరదా ... మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది బైక్ మీద భామ అయితే లేదు కానీ ఆ జర్నీ ఇచ్చే కిక్కుంది రుషికొండ సమీపంలో సరుగుడు చెట్ల తోట పక్కనే బీచ్ చాలా అందంగా వుంటుంది . మాతో వచ్చినవాళ్లు , ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ ,స్టాఫ్ కలసి ఆ తోటలో మందు, ముక్క పెట్టుకుని పేక
ఆడుతుంటే నేనలా సాగరపు ఒద్దు చేరుకున్నా
అక్కడ ఆ సాగరంలో నున్నని నల్లని శిలలు నా మనసు ని ఆకర్షించాయి . వెళ్లి ఆ శిలల పై కూర్చున్నా . ఒక్కో అల అలా వచ్చి ఇలా ఈ రాళ్లను సుతారంగా తాకి వెళుతుంటే ప్రేయసి పాదాలను తాకి మురిసిపోయే ప్రేమికుడి అంతరంగంలా ఆ అలల తరంగాలు నా మనసును హత్తుకున్నాయి
సమయం గడుస్తున్నకొద్దీ అలల వేగం కొద్ది కొద్దిగా పెరగసాగింది . సుతారంగా శిలలను తాకి వెనుకకు మరలిన అలలు రెట్టించిన ఉత్సాహంతో ,ప్రేయసి పాదాలు ముద్దాడి మురిసిన ప్రియుడు మరింత ప్రేమగా ప్రియురాలి నుదురు ముద్దాడ వేగిర పడినట్లుగా కడువేగంతో ఎగసిపడుతూ వచ్చి ఆ శిలల శిఖరాన్ని తాకసాగాయి
అప్పటివరకు ఆ అలల తడి నా పాదాల వరకే పరిమితం కాగా , సమయం గడుస్తున్న కొద్దీ , పొద్దు గుంకుతున్న వేళ ఆకాశంలో రాబోయే చందురుని కోసం ఆశగా ఎదురుచూస్తూఆ చందురుని అందుకోవాలని ఆబగా ఎగిరెగిరిపడుతున్న అలల ఝడి క్రమక్రమంగా నా మోకాళ్ళను దాటి నా నుదురు తాకుతుంటే ఆ అలల తరంగాలతో మమేకమైన నా ఆలోచనా తరంగాలు కదిలిపోతున్న కాలాన్ని గాని రాబోతున్న ప్రమాదాన్ని గాని గుర్తించే మెలుకువ లో లేదు
ఇంతలో పెద్దగా సముద్రుడి ఘోషను కూడా దాటుకుని ఆ తరంగాలతో లీనమైన నా మనసును
కుదుపుకు గురి చేస్తూ పెద్దగా అరుపులు ఏమిటా అని వెనుకకు తిరిగితే ఒడ్డున నిలబడి మా వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు బయటకు రా రమ్మని , అపుడు అర్ధమైంది నేనొచ్చి చాలా సమయం గడిచిపోయిందని అలల వేగం క్రమేపి ప్రమాదకరంగా మారుతుందని . ఒడ్డుకు వచ్చి చూస్తే వాళ్ళ ముఖాల్లో ఆందోళన ... ఏమున్నదబ్బా వాళ్ళు వాళ్లకిష్టమైన పేకాటలో మునిగిపోయారు ,నేనేమో నాకు ఇష్టుడైన సముద్రుడితో మమేకమై పోయాను
సముద్రం అదొక అద్భుతం . సముద్రుడి అలలకు మనిషి ఆలోచనలకు అలుపు లేదు నిరంతరం అవి సాగుతూనే ఉంటాయి . సాగర గర్భంలా మనిషి మనసు కూడా లోతు తెలియనిదే . సముద్రాన్ని పోలినదే మన మెదడు కూడా . రెంటికి ఉన్న గొప్ప లక్షణం దృశ్య రూపకం గా చూడగలగటం . నీటికి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి వుంది అదే విధంగా మన మెదడు కూడా తన ఊహకు అందిన విషయానికి దృశ్య రూపం ఇవ్వగలదు అంతేనా లక్ష్మీమ్ క్షీర సముద్రరాజ తనయాం అని కీర్తిస్తాం , జయ జనని సుధా సముద్రాంత రుధ్యన్మణి ద్వీప సంరూఢ అంటారు అమ్మ శ్యామలను అదేవిధంగా మన మనస్సనెడి సముద్రంలో అమ్మను చూస్తాం
అందుకే సముద్రుడిని చూస్తే అంతలా ప్రేమలో పడతాం ... తనివి తీరలేదు నా మనసు నిండలేదు ఏనాటి బంధమో సాగరమా మనది .....
Tuesday, June 30, 2020
విఠల విఠల
నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపా రసంబు పై
జల్లెడువాఁడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దోచెనో
మల్లియలారా మీ పొదల మాటున లేదు గదమ్మ చెప్పరే
శరద్కాలపు వెన్నెల రాత్రులలో గోపాంగనలతో చక్కగా రాసలీల లాడుతున్న నిత్య
చైతన్య మూర్తి యగు శ్రీక్రిష్ణ భగవానుడు ఒక్కసారిగా అదృశ్యమైపోతే ఆయన ఎడబాటు
తట్టుకోలేని ఆ గోపికలు విరహ వేదనతో ఆ వనమంతా సంచరిస్తూ కనబడిన ప్రతి చెట్టుని
పిట్టను పువ్వును తుమ్మెదలను ప్రశ్నిస్తూ తమ అనుంగు చెలికాడి జాడ తెలియక అమితమైన
భాధ చెంది వున్నారు.
వారి భాధ చూసి నా మనసు వేదన చెంది ఎక్కడికి చేరాడో ఈ నల్లనయ్య అని నేను ఈ లోకాన్ని
గమనించటం మొదలు పెట్టా
అందుగలడిందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడన్న ప్రహ్లాద వాక్యం పై నమ్మకంతో
లోకమంతా కృష్ణుడిని చూడ నెంచితి కానీ అది అంత తేలిక కాదని తేలిపోయింది . మరి ఎక్కడ పట్టాలి ఈ వెన్న దొంగను
గోవిందా గోవిందా అంటూ తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుం టే ఈడ వున్నాడు నా స్వామి అని పరుగు పరుగున కొండపై కెక్కి చూస్తే ఎక్కడో ఏడు ద్వారాల ఆవల అరమోడ్పు కనులతో
నా పాదాలపై దృష్టి నిల్పమని సూచిస్తూ నిలుచుని వున్న ఆ శ్రీనివాసుని దివ్య తేజస్సు పై
మనసు నిలిపే లోపే వాకిలి వెలికి వచ్చి పడ్డా
ఈయనే అని తెలుస్తుంది కానీ దగ్గరకు చేరేదెలా ఆ పాద పద్మం చూసేదెలా
నీ హృదయ పద్మంలో వున్నాడయా అని చెపుతారు జ్ఞానులు . కళ్ళెదురుగా వున్నా ఆ కమనీయ రూపాన్ని పోల్చుకోలేని అజ్ఞుడను ఎక్కడో లోపల హృదయంలో దాగిన వాడిని పట్టటం యెలా
ఎలా ఎలా అని మధనపడుతున్న సమయంలో పిలిచాడు నా స్వామీ వేగిరమ్మే రా రమ్మని
పండరీపుర ధామానికి
ఇంకేమీ ఆలోచించలా లేచిందే లేడి కి పరుగన్నట్లు పరుగులు తీసితి పురంధరుని పద సన్నిధికి
ఆ ధామం లోపలి అడుగుపెడుతుంటేనే ఒక విధమైన ఆనందపు అనుభూతి . జ్ఞానేశ్వరుడు
ఏకనాధుడు తుకారాం వంటి మహా మహుల పాద స్పర్శతో నేల తల్లి, వారి కీర్తనల తరంగాలతో వాయువు పునీతమైన ప్రాంతమది
ఆ అనుభూతి పొందిన మనసుతో గర్భ గుడిలోకి అడిగిడితి
ఎదురుగా బంగారు వర్ణంతో మెరిసిపోయే వస్త్రం ధరించి, ఆకుపచ్చని తలపాగా తో , ముత్యాల హారాలు మేడలో వేలాడుతుండగా , తెల్లని పట్టు పంచె కట్టి
రాచ ఠీవితో నడుమున రెండు చేతులు పెట్టి ఇట్టిట్టిదని వర్ణించనలవికాని సౌందర్యంతో
కరుణ రసం తో నిండిన కనులు ప్రేమగా నను చూస్తుంటే ,
సంపెగ సౌరభాలను దిక్కరించు అందమైన నాసిక తో అలరారుతూ ,
తదియ నాటి చంద్రుడిలా ఆ ఎర్రని పెదవులపై చిరు దరహాస చంద్రికలు పూయిస్తూ
బోర్లించిన అష్టమి నాటి చంద్రుడిని పోలిన ఆ నుదుటి పై కస్తూరి తిలకాన్ని ధరించి
దయ అనే జలాన్ని అణువణువు నింపుకుని,
నిండుగా జలాన్ని తనలో నింపుకున్న వానాకాలపు దట్టమైన వాన మబ్బురంగు లా మిలమిల మెరిసిపోతున్న దేహంతో
ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ తన్మయమైపోయి అలా నిలబడిపోయా
వెంటనే అక్కడే వున్న భగవత్ సేవకుడొకరు నా తలవంచి స్వామి పాదాలపై పెట్టారు
అంతే ఒక్కసారిగా ఎపుడు అనుభవించని చల్లదనమేదో నా నుదిటిపై ఒక్కసారిగా స్పృశించితే
నా చేతులతో ఆ స్వామి పాద పద్మాలను తాకితే ఆ మెత్తదనం
వాటిని వేటితోను పోల్చలేం కానీ అర్ధం చేసుకోవాలంటే కొలనులో విరబూసిన కమలాన్ని ఒక్ కసారి
కనులపై పెట్టుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుందో ఆ తామర తూడును తాకితే ఎంత సుతిమెత్తగా
అనిపిస్తుందో అలా
ఓ అద్భుతం
ఏ వైష్ణవ ఆలయానికి వెళ్లినా మనం నారాయణుడి సమీపం చేరలేం దూరం నుండి దర్శించుకోవాల్సిందే . అందుకే తిరుమలలో కొలువైన దయామయుడైన ఆ శ్రీనివాసుడు
తన పాదాలను ఆశ్రయించి ఆనందంగా ఉండమని సూచిస్తూ ఆ పాదాలను ఆశ్రయిస్తే పొందే
ఆనందపు అనుభూతి సారాన్ని అందరికీ అందించటానికై విట్టలుడిగా పాండురంగ నామధేయంతో
ఈ పండరీ పుర క్షేత్రంలో మనకై నిలిచియున్నాడు
విఠల విఠల పాండురంగ జయ జయ
విఠల పాండురంగ
Sunday, June 28, 2020
ఇంటర్ చదివే రోజుల్లో
చదువుల ఖిల్లా గుంటూరు జిల్లా అని అప్పట్లో పద వ తరగతి ఫలితాలు రాగానే
పేపర్ లో వచ్చే ప్రముఖ వార్త . అందుకు కారణమైన తాడికొండ గురుకుల విద్యాల యం
లో చదువైపోగానే ........
తరువాత ఏంటి ? తలెత్తే మొదటి ప్రశ్న
ఎటువైపుకు ఈ గమనం ...... ఇంజనీరింగ్ అని ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళు
అది అయితే చదవటానికి బుర్ర ను కష్టపెట్టాలి వద్దు వద్దని మనసు
అందుకే సి ఈ సి చేస్తాను అని చెప్పేసాను మనసు మార్చాలని ప్రయత్నించారు కానీ కుదరలే
ఏమి చదవాలో నిర్ణయించా . ఎక్కడ చదవాలి మళ్ళీ గురుకుల విద్యాలయానికే .
ఈసారి కొడిగెనహళ్లి అనంతపురం జిల్లా . సరే అన్నీ సర్దుకుని అక్కడకు చేరాక తెలిసింది అప్పటికి
ఆ కాలేజీ మొదలయ్యి రెండో సంవత్సరమే దానికి ఎటువంటి శాశ్వత భవనాలు ఇంకాలేవు
అందుకని తాత్కాలికంగా హిందూపురం లో వసతి తరగతులు ఏర్పాటు చేశారు . ఆ ప్రాంతానికి
మా అన్న నందమూరి తారక రాముడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలమది
కాలేజీ ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకున్నాం . అప్పటిదాకా లేని పరిమళాల గుబాళింపు
ఒక్కసారిగా మనసును ఉక్కిరి బిక్కిరి చేయగా .......ఎటు చూడాలో తెలియక కనులు తికమక
పడుతుంటే ... కోకిలల కుంజారావములు చెవులకింపుగా తాకుతుంటే ... నిన్న లేని భావమేదో నేడు నిదురలేచెనెందుకో ...
ఏమైయుంటుందబ్బా .... కొన్ని పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు ఇంకొన్ని ముత్యాల సరాలు
రంగరించి బ్రహ్మ చెక్కిన బొమ్మల సందోహంలో మనసు సుడులు తిరుగుతూన్నంతలో
అమ్మా! భయం బాధ కలగలిసిన ఓ గావుకేక వెన్ను జలదరించేలా . ఊహల ఊయలలో వూగుతున్న మనసు ఒక్కసారిగా తుళ్ళి పడి తేరిపారాచూస్తే
ఎదురుగా సినిమా షూటింగ్ సన్నివేశామా అనిపించేంత బ్రాంతి . కాదు నిజమే అని తెలిసి
పోలీస్ మార్క్ థర్డ్ డిగ్రీ ఇంత భయానకంగా వుంటుందా సినిమా పోలీస్ ఎందుకు పనికిరారు
అలా ఓ దొంగను చిత్రహింసలు పెడుతూ..
ఒక చిత్రమైన వాతావరణం కుడి కంటి వైపు ........ వయ్యారంగా నడిచే వాలుచూపుల రాజహంసలు
ఎడమ కంటి వైపు .... కరకు చూపుల ఖాకీలు
మధ్యలో ... కుర్రళ్లోయ్ కుర్రోళ్ళు
విషయమేమంటే ఒకటే క్యాంపస్ లో హిందూపురం పోలీస్ స్టేషన్ ,వాళ్ళ క్వార్టర్స్ , ఉమెన్స్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ , మా ఇంటర్ బాయ్స్ కాలేజీ
ఎదో మొదటి రోజు ఆసక్తిగా చూడటమే తప్ప భగవానుడి కృపతో మనసెపుడూ అటు మళ్ళలేదు
ఎన్నో చిలిపి ప్రేమకథలు విన్నాం ఆ రెండు సంవత్సరాలలో
మా మిత్ర బృందం లో అందరు తెలివైన చురుకైన వారు కావటం చదువులు ఆటవిడుపుగా సినిమాలు తప్ప ఇతర విషయాలపట్ల మాకు పెద్దగా ధ్యాస లేదు . నేనొక్కడినే చదువంటే కూసింత అనాసక్తంగా వుంది . నేను సీఈసీ అన్న పేరే గాని మా క్లాసుమేట్స్ ఎవరితోనూ
పెద్దగా పరిచయం లేదు మా మిత్రులంతా బైపీసీ వారే .
వారికి శరీరాన్ని అర్ధం చేసుకుని చికిత్స చేయటం అంటే ఆసక్తి నాకు నా మనసు అర్ధం చేసుకుని
దానికి చికిత్స చేయటం ఆసక్తి రెంటికీ బేస్ శరీరమే
వారిలో బాగా ఆత్మీయుడు మారెళ్ల పున్నయ్య చౌదరి . మా మిత్ర బృందంలో వారంతా ఇపుడు
గొప్ప డాక్టర్స్ అయ్యారు (రమణా రెడ్డి , మాధవ్ ) దేశం దాటి వెళ్లిపోయారు .మా చౌదరి మంచి భావుకత కలిగి ఉండేవాడు . సూర్యదేవర నవలలు చదివి వాటిని మాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేస్తూ మరీ వివరిస్తూ ఉండేవాడు రోజు రాత్రిళ్ళు .మోడల్ నవలను చెప్పిన తీరు ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగుతూనే వుంది .
ఎన్టీఆర్ పుణ్యమా అని అక్కడ అప్పట్లో పట్టు పురుగుల కేంద్రాలు బాగా ఉండేవి . ప్రొద్దు తిరుగుడు పువ్వుల తోటలతో మల్బరీ ఆకుల తోటలతో
చాలా ఆహ్లాదకరం గా ఉండేది. కన్నడ సరిహద్దు ప్రాంతం కావటంతో కన్నడ తెలుగు యాసతో ఆ భాష చాలా ఇంపుగా ఉండేది
కాలేజీ ప్రక్కనే పెద్ద చింత తోపు వెలగ చెట్ల తోపులుండేవి . వెలగ చెట్లు మన తాడి చెట్ల కన్నా ఎంతో పొడవుగా వుండేవి వాటి పైకి రాళ్లు విసిరి వెలగ కాయలు కొట్టుకుని తిన్న ఆ రోజులు బహు పసందు
కాలేజీ తరుపున విహార యాత్రకని ముందు పుట్టపర్తి బాబా దగ్గరకు తీసుకెళ్లారు . అది ఒక గొప్ప అనుభూతి . ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్ళినపుడు మనం ఎలా ఉండాలో నేర్పింది. . ఎన్ని వివాదాలు ఆయన చుట్టూ వున్నా ఆయన పట్ల నాకు గౌరవంతో కూడిన తటస్థ భావం ఏర్పడింది
ఆ సమయం క్రిస్మస్ కి నూతన సంవత్సరానికి మధ్య కాలం . వేల సంఖ్యలో భారతీయులు విదేశీ భక్తులు అక్కడ వున్నా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా దాని అర్ధం అపుడే అర్ధమయ్యింది . ఆయన ప్రసంగం విన్నాను సరళంగా స్పష్టంగా , ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు
ఆ తరువాత బెంగుళూరు మైసూర్ వెళ్ళాం మా దగ్గర నుండి 2గంటల్లో బెంగుళూరు చేరుకోవచ్చు
బృందావన గార్డెన్స్ పర్యటన ఓ మధురానుభూతి . అక్కడ నా రెండో వలపు సెకండ్ క్రష్ .....
ముగ్ధ మనోహర సుందర సుకుమార లలిత లావణ్య కన్నడ కుసుమం
అచ్చు మెరుపు తీవెలా బంగారు మేని వర్ణంతో మెరిసిపోతూ
ఆ సంధ్యా సమయంలో నేలకు దిగివచ్చిన తారక లా
ఎంతగా నను కదిలించిందంటే ఈనాటికి ఆ క్షణం నా హృదయంలో పదిలం పదిలం
ఈ క్షణం ఏడ నీవున్నావో
ఓ సన్నజాజి పూవా
గాలి గుర్రాలు పూంచిన మేఘ మాలికల రథమెక్కి
మెరుపు తీగలా ఓ సారి కనిపించి పోరాదే ఆశతోడి
మా ఇంటి మిద్దె పై కెక్కి నింగి తారకలలో నీ జాడకై
వెతికేనే నా కనులు అలవక సోలవక కన్నడ సుమబాలా
అలా గడిచిపోయింది ఆ విహార యాత్ర . రెసిడెన్షియల్ కనుక బయటకు ఎలాబడితే అలా వెళ్ళకూడదు మాకేమో సినిమాల పిచ్చి . అల్లుడు గారు మూవీ బాగుంది వెళ్లాలని
ఉండబట్టలేక నేను మా చౌదరి రమణా రెడ్డి సెకండ్ షో కి ఎవరికీ తెలియ కుండా జంప్ అయ్యాం
వచ్చి రూమ్ లోకి వెళ్లబోయే ముందు వాచ్ మన్ చూసాడు . మరుసటి రోజు ఉదయం మా ప్రిన్సిపాల్ కి చెప్పాడు . ఆయన అందరి ముందు అసెంబ్లీ లో ముగ్గురిని పిలిచాడు . మేం ముగ్గురం ఒకటే చెప్పాము మూవీ కి వెళ్ళలేదు అప్పటి దాకా చదువుకుని ఆకలి వేస్తుంటే దిల్ పసందు తిని రావటానికి వెళ్ళాం అని. బైపీసీ లో వాళ్లిద్దరూ వాళ్ళ లెక్చరర్స్ బాగా ఇష్టమైన స్టూడెంట్స్ , అలాగే మా
లెక్చరర్స్ కి నేను బాగా అభిమానం . అందుకని
లెక్చరర్స్ ముందుకు వచ్చి వాళ్ళు చదువుకునే వల్లే కానీ సినిమాలకు వెళ్లారని వెనకేసుకొచ్చారు అలా పనిషమెంట్ తప్పించుకున్నాం ఇలా ఎన్నో జ్ఞాపకాలు
మిత్రులందరూ వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు . మరి నేనేమిటి నా గమ్యం ఏమిటి ఎపుడు నన్ను తొలిచే ప్రశ్న .
ఇపుడిపుడే సమాధానం దొరుకుతుంది . నా గమ్యం గమనం ఎటువైపుకో
వదల వదల క్రిష్ణా నిన్నొదలా
బద్దకపు అంగవస్త్రంబు చుట్టి మోహ చురకత్తుల
Saturday, June 13, 2020
వానొచ్చే వరదొచ్చె
వానొచ్చే వరదొచ్చె గోదారి పొంగల్లే భావాల వరదొచ్చే
ఇంకా గ్రీష్మం ముగియకముందే వర్షఋతువు సందడి మొదలయ్యింది
భానుడి భగ భగ లతో బీటలు పడిన నేల నింగి నుండి జాలువారిన నీటి ధారలతో
పులకించి మట్టి గంధపు వాసనలు వెదజల్లగా ఆ పరిమళాలు నా ముక్కు పుటాలు
సోకి మనసును మా వూరి వైపు చిన్న నాటి తీపి జ్ఞాపకాలవైపు పరుగులు పెట్టించింది
మేఘం నిండితే జలధారలు కురుస్తాయి
మనసు నిండితే భావాల మాలికలు పూస్తాయి
అందుకే ఆ రెండు ఎపుడు నిండుగా ఉండాలి అపుడే మన జీవితం పచ్చగా చల్లగా వుంటుంది
మా వూరు మంత్రిపాలెం ... ఇంటి ఎదురుగా ఓ చెరువు దానికి ఓ పేరు రావారి చెరువు (రావి అనే ఇంటి పేరు గల వారి చెరువు) దానికున్న గుర్తింపు మనకు లేకపోయే
ఆ చెరువు ఒడ్డున ఇంటికి పర్లాoగు దూరంలో చదువుల గుడి మా బడి
ఆ బడి కి ఎదురుగా ఓ డాబా ఇల్లు పెరటిలో జామ చెట్టు చెట్టుకింద మంచినీటి చేతిపంపు
ఇంతే అయితే ఆ ఇంటిని గుర్తుంచుకునే విశేషమే ముందంటారా
అదే మరి చెప్పేది ...... తొలి వలపే తీయనిది నా ఫస్ట్ క్రష్
బూరెల్లాంటి బుగ్గలతో కొంచెం తెలుపు కొంచెం ఎరుపు కలిసిన మేని కాంతులతో
అపుడెపుడో కొన్ని దశాబ్దాల క్రితం చూశాం ఇప్పుడెలా వుందో .......
వానాకాలంలో బడికి వెళ్ళేటపుడు దారిలో వాళ్ళ ఇంటి దగ్గరలో రోడ్డు మీద గుంతలు వాటిలో
వాన నీరు నిలిచివుంటే ఆ నీటిలో చిందులేస్తూ ఆనందించిన క్షణాలు
ఇక వర్షం పడుతున్నప్పుడు చూరు లో నుండి (తాటాకు గడ్డితో వేసిన ఇంటి కప్పు) జారుతున్న
నీటి బిందువులను అరచేతిలో ఒడిసిపడుతూ ప్రేయసి నవ్వుల్లో జాలువారుతున్న ముత్యాలు అరచేతిలో సవ్వడి చేస్తున్నట్లుగా మురిసి పోయిన ఆ క్షణాలు
వసారాలో వాలు కుర్చీ వేసుకుని వేయించిన వేరుశనగ పప్పుల్లో ఉప్పు కారం దట్టించి నోటిలోకి ఎగరేసుకుంటూ ధాటిగా కురుస్తున్న వాన చినుకుల చప్పుళ్లలో చెలి అడుగుల సవ్వడులు వింటూ మనసు కేరింతలు కొడుతున్న ఆ క్షణాలు
దట్టంగా అలిమిన నల్లని వాన మబ్బు చాటు తెల్లగా మెరిసిపోతూ సన్నని మెరుపు కాంతలు
ఓ క్షణకాలం అలా పలకరించిపోతే విరిసి విరియని ప్రేమకాంత పెదవుల నడుమ సన్నని ముత్యాల పలువరుసపై విరిసిన చిరు దరహాస చంద్రికలు నా మనసున పూచిన ఆ క్షణాలు
ఇంతలోనే ఓ పిడుగుపాటు .... ఉలికి పాటు ముసురుకున్న భావాల మేఘాలను చెరి పివేస్తూ ..... పెళ్ళాం పిలుపు ను గుర్తుకు చేస్తూ
(పాపము శమించబడుగాక భార్య భగవంతుడిచ్చిన వరం ఇంటికి మహారాణి ఎదో కూసింత హాస్యం కోసం అనటమే తప్ప ... మరేం ఉద్దేశ్యం లేదు)
ఏది ఏమైనా ఆ రోజులు మునుముందిక రావేమిరా
నేను మారలేదు నా భావుకత చావలేదు
కాలం మారిపోతే నేరం నాదేల తండ్రి నారాయణా
హే క్రిష్ణా ఈ పట్టణ వాసం భారం వదిలించి ప్రకృతి ఒడిలో పల్లెసీమలో స్వేచ్ఛ విహారం చేయు
అదృష్టమిప్పించవయా
Subscribe to:
Posts (Atom)