Wednesday, November 18, 2009

తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె



తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె
మా మనస్సులను రంజింపజేయు మందస్మిత వదనార విందా
పరమ సత్యమైనట్టివాడ నంద గోప తనయా నారదాది
మునింద్రులచే కీర్తించబడు హరీ ఎల్లప్పుడూ నిన్నే తలచెదను

నీ కర చరణాలనే పద్మాలతో నిండి
చల్లని వెన్నల బోలు చూపులను ప్రసరించు నీ
చక్షువులే చేప పిల్లలుగా కల హరిరూపమనే
సరోవరం లో కొద్ది జలాన్ని త్రాగి జీవనయానపు
బడలిక నుండి పూర్తిగా సేద తీరెదను

కలువ పూల వంటి కనులతో , శంఖు చక్రాల తో
విరాజిల్లు మురారి స్మరణ ఓ మనసా ! ఎన్నటికి
మరువకు అమృతతుల్యమగు హరి పాద పద్మాలను
తలచుటకన్నను తీయని తలంపు మరి లేదు కదా

ఓ అవివేకపూరితమైన మనసా ! నీ స్వామి శ్రీధరుడు చెంత నుండగా
మృత్యువు గూర్చి నీవొనరించిన పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత ఏల ?.
ఇంకను ఆలస్యమేల? తొందరపడు అత్యంత సులభుడైన నారాయణుని
పాదాలను నీ భక్తి తో బంధించు నీ బంధనాలు తెంచుకో


జనన మరణాలనే రెండు ఒడ్డుల కూడిన సాగరం లో
వచ్చిపోయే కెరటాల వలె నానా జన్మల పాలై
రాగ ద్వేషాలనే సుడిగుండంలో చిక్కుకుని
భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల
కోరలకు చిక్కి చితికిపోతున్న నాకు మత్స్యరూపధారి హరీ నీవే దిక్కు .


దాటశక్యం కాని సంసార సాగరం చూసి
దిగులు చెందకు ఆందోళన విడుము
నిర్మల ఏకాగ్రచిత్తంతో ధ్యానించు
నరకాసుర సంహారి నావలా మారి నిన్నావలి తీరం చేర్చగలడు

(Mukunda maala ku P S Ramachander garu vrasina aangla anuvada sahaayamto

krishnudu palikinchina bhavala kurpu)