Saturday, November 21, 2009

ఆగు …..నన్ను వెంబడించకు


మనసా తుళ్ళి పడకే ……..
అతిగా ఆశ పడకే …….
ధర్మం మీరి ప్రవర్తించకే

ఎన్నిసార్లు నచ్చచెప్ప ప్రయత్నించిన వినకున్నది మనసు
అది మన మాట వింటే మనకిన్ని సమస్యలెందుకు

అయినా మనం మాత్రం …….మన అంతరాత్మ ఘోషిస్తూనే వుంటుంది
వలదు వలదని మన బుద్ది వింటుందా

మరి నిలకడలేని మన బుద్ది సలహా మనసెలా వింటుంది .

అంతరాత్మ రూపంలో ఆ పరమాత్మ చెప్పేదానినే పెడచెవిన పెడుతున్నాం
అందుకే ఇన్ని సమస్యల సహవాసం మనకు లభిస్తుంది

మన బుద్దిని ప్రక్కదారి పట్టించే వాటినే ముద్దుగా అరిషడ్వర్గాలు అంటాం
వాటన్నిటికి రారాజు ….మోహం
ఇదే అన్నిటికి మూలం ….
దీనికి ..కామం అనేది మంత్రి
క్రోధం …….సేనాధిపతి
లోభ మద మాత్సర్యాలు ……సైనికుల్లాంటివి

అందుకే దేనిపైన కూడా మోహం …వ్యామోహం కూడదని పెద్దలు సుద్దులు చెబుతారు

అలా వ్యామోహం లేని స్థితినే నిర్వికారం అంటాం . అది యోగుల స్థితి . మనకు చెల్లుబాటు కాదు
మరి మనం ఏమి చేయాలి
మన మోహాన్ని కనీసపు స్తాయికి తగ్గించుకోవతానికైనా ప్రయత్నించాలి
లేదా దానిని సక్రమ మార్గంలోకన్న మళ్ళించాలి

అనవచ్చు ..అందరు నిర్వికారం గా వుంటే సమాజం ఎలా నడుస్తుందని
శుబ్రం గా నడుస్తుంది . నిర్వికారమంటే ఎ పని చేయకుండా నీరసించి వుండటం కాదు
అన్ని పనులు చేసుకుంటూనే దేనిపైన వ్యామోహం లేకుండా వుండటం .
అలాంటి వారే ఆనందం చవి చూడగలరు

ఏమో ఇవన్ని చెప్పుకోవటానికి బాగానే వుంటాయి . ఆచరించటం
బహు కష్టం
ఓ వ్యామోహమా ఆగు నన్ను వెంబడించకు
హే కృష్ణా
ఈ గోలంతా నాకెందుకు …………
నన్ను వీడని ……నా మనసును కల్లోలం చేస్తున్న ఈ మోహపు సుడిగుండం
దారి మళ్ళించు

లౌకిక విషయాల పట్ల , కృశించి నశించి పోయే సౌందర్యాల పట్ల
తీయని అనుబంధాల పట్ల నాకున్న వ్యామోహాన్ని నీ వైపుకు మళ్ళించు

ఓ గోవిందా ………
జనన మరణ సమయాల్లో నాతోడు రాని , ఆ రెంటి నడుమ కాలం లో అందీ అందక అందుబాటు లోకి రాని , మనసుకు శాంతి నోసగని సంపదలపై నాకున్న వ్యామోహం తొలగించు

ఎల్లప్పుడూ నీ హృదయం పై నిలిచి వుండే వెల లేని సంపద శ్రీవత్స చిహ్నం పై
నాకు ఎనలేని వ్యామోహం కలిగించు

ఓ గోవర్ధన గిరిధారి

రక్త మాంసాలతో కూడి , నానావిధ మలభుయిష్టమైన శరీరాల పట్ల వ్యామోహం తొలగించు

మన్మధుడిని దగ్ధం చేసిన ముక్కంటి కే మదనతాపం కలిగించిన
సత్యము నిత్యమూ అయిన నీ రూప లావణ్యాల పట్ల వ్యామోహం కలిగించు

ఓ యశోద నందనా
తొలుత ఆనందాన్ని తుదకు విచారాన్ని మాత్రమే మిగిల్చే అనుబంధాల
భంధనాలపై వ్యామోహం తొలగించు

ఎంత గ్రోలినా తనవి తీరని మకరందామృతం వంటి నీ లీలా విన్యాసాల
గాధల పట్ల ఎడతెగని వ్యామోహం కలిగించు

నా మోహం …..వ్యామోహం అంతా నీపైనే కృష్ణా

Wednesday, November 18, 2009

తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె



తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె
మా మనస్సులను రంజింపజేయు మందస్మిత వదనార విందా
పరమ సత్యమైనట్టివాడ నంద గోప తనయా నారదాది
మునింద్రులచే కీర్తించబడు హరీ ఎల్లప్పుడూ నిన్నే తలచెదను

నీ కర చరణాలనే పద్మాలతో నిండి
చల్లని వెన్నల బోలు చూపులను ప్రసరించు నీ
చక్షువులే చేప పిల్లలుగా కల హరిరూపమనే
సరోవరం లో కొద్ది జలాన్ని త్రాగి జీవనయానపు
బడలిక నుండి పూర్తిగా సేద తీరెదను

కలువ పూల వంటి కనులతో , శంఖు చక్రాల తో
విరాజిల్లు మురారి స్మరణ ఓ మనసా ! ఎన్నటికి
మరువకు అమృతతుల్యమగు హరి పాద పద్మాలను
తలచుటకన్నను తీయని తలంపు మరి లేదు కదా

ఓ అవివేకపూరితమైన మనసా ! నీ స్వామి శ్రీధరుడు చెంత నుండగా
మృత్యువు గూర్చి నీవొనరించిన పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత ఏల ?.
ఇంకను ఆలస్యమేల? తొందరపడు అత్యంత సులభుడైన నారాయణుని
పాదాలను నీ భక్తి తో బంధించు నీ బంధనాలు తెంచుకో


జనన మరణాలనే రెండు ఒడ్డుల కూడిన సాగరం లో
వచ్చిపోయే కెరటాల వలె నానా జన్మల పాలై
రాగ ద్వేషాలనే సుడిగుండంలో చిక్కుకుని
భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల
కోరలకు చిక్కి చితికిపోతున్న నాకు మత్స్యరూపధారి హరీ నీవే దిక్కు .


దాటశక్యం కాని సంసార సాగరం చూసి
దిగులు చెందకు ఆందోళన విడుము
నిర్మల ఏకాగ్రచిత్తంతో ధ్యానించు
నరకాసుర సంహారి నావలా మారి నిన్నావలి తీరం చేర్చగలడు

(Mukunda maala ku P S Ramachander garu vrasina aangla anuvada sahaayamto

krishnudu palikinchina bhavala kurpu)

Thursday, November 12, 2009

ముకుంద మాల


ఓ ముకుందా
శ్రీవల్లభ వరదా భక్తప్రియా దయాసాగరా
నాధా , జగన్నివాసా , శేషశయనా
ప్రతి దినం అమృతమయమైన ని నామాలను
స్మరించు వివేచన కలిగించు

దేవకీనందన దేవాధిదేవ జయము జయము
వృష్టి వంశ ప్రదీప జయము జయము
నీల మేఘశ్యామ జయము జయము
ధర్మ రక్షక జయము జయము

ఓ ముకుందా
శిరము వంచి ప్రణమిల్లి మిమ్ములను యాచిస్తున్నాను
నా రాబోవు జన్మలెట్టివైనను మి పాద పద్మములను
మరువకుండునటుల మి దయావర్షం నాపై అనుగ్రహించుము

ఓ హరి !

కుంభిపాక నరకములనుండి , జీవితపు ద్వంద్వముల నుండి
రక్షించమనో ,
మృదువైన లతల వంటి శరీరంతో కూడిన రమణీమణుల పొందుకోరి
నిన్ను ఆశ్రయించలేదు
చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో
జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు
అనుగ్రహించుము చాలు

ఓ దేవాధి దేవా !
నేనెంత నిరాసక్తుడైనప్పటికి పూర్వ కర్మల వాసనా బలం చేత
ధర్మాచరణ , భోగ భాగ్యాల అనురక్తి నను విడకున్నవి
కాని నేను నిన్ను కోరే గొప్పదైన వరం ఒక్కటే , జన్మ జన్మలకు
కూడా ని చరణారవిన్దాలు సేవించుకునే భాగ్యం కల్పించు .

ఓ నరకాసుర సంహార !

దివి , భువి లేక నరకం నీవు నాకు ప్రసాదించే
నివాసమేదైనప్పటికిని , మరణ సమయంలో
శరత్కాలపు నిర్మల సరోవరంలో వికసించిన నవ కమలములవంటి ని పాదములు నా మనో నేత్రంలో నిలుపు చాలు

మహా జ్ఞాని , భక్తి సామ్రాజ్యపు మహారాజు చేర (కేరళ) సామ్రాజ్యాదీసుడు కులశేఖర ఆళ్వార్ ముకుందునకు సమర్పించిన పూమాల లోని మొదటి ఆరు పూలకు భక్తి వేదాంత స్వామి వ్రాసిన ఆంగ్ల అనువాద ఆధారంగా

Friday, November 6, 2009

నేను గీత

ఎవరా గీత ఏమా గాధ
పక్కింటి అమ్మాయో లేక మరొకరో కాదు
మన రాత మార్చేందుకు భగవానుడు చెప్పిన గీత
అదే భగవద్ గీత

చిన్నప్పటి నుండి వింటూనే వున్నాం ….ఘంటసాల గళమాదుర్యం లో గీతను
కాని దానిని అధ్యయనం చేసి ఫలం పొందగలిగినది మాత్రం ఆరేడు సంవత్సరాల
క్రితం
ఎప్పటిలానే తెల్లవారినా , పొద్దు మాత్రం అనుకోని రీతిలో గ్రున్కింది
మన అనుకున్న వారి నుండి ఎదురైన వూహించని పరాభవం
మనసును మెలి తిప్పుతుంటే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అని విషాద గీతం
పాడుకుంటూ గది తలుపులు బిగించుకుని మనసు తలపులు తెరచి
విలపించెంతలో
గూటిలో ఎప్పుడో కొనిపడేసిన భగవద్ గీత ఓరి అమాయకుడా
నన్ను చూడరా అని పిలుస్తున్నట్లున్నది

చేతిలోకి తీసుకుని పేజి త్రిప్పగానే అర్జున విషాదయోగం …….
అది చూసి విషాదం గా నవ్వుకుంటూ చదవటం మొదలెట్టాను

కాలం గడుస్తున్నది …….అర్ధం చేసుకునే కొద్ది మోహపు
మాయ వీడి జీవితపు మర్మం తెలియరాసాగింది
దానితో పాటే గుండెల్లో గూడు కట్టిన భాద ఆవిరైపోసాగింది
చివరకు మిగిలింది ……
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అంతలా నన్ను ప్రభావితం చేసిన భగవద్ గీత నేడు ఎంతలా నాతొ కలసిపోయిందంటే
ఎక్కడైతే తొలి విషాదాన్ని చవి చూసానో తిరిగి అక్కడే మరో ఇబ్బందికరమైన వార్త
వినరావల్సివచ్చింది .
విశేషం …….అప్పుడు ఇప్పుడు కార్తిక మాసమే

గురు దశ మొదలవుతున్నదని , గురువు యొక్క శాపానికి గురి అయ్యానని , ఇది 18 సంవత్సరాలు కొనసాగుతుందని , ఉపసమించటానికి వైడూర్యము , కనక పుష్యరాగము ధరించమని దాని సారాంశం
మళ్ళి మొదలు …..అర్జున విషాదయోగం
మనసును మధిస్తే చివరకు దక్కిన సమాధానం ……..
నా పుట్టిన రోజు …18
భగవద్గీత లో అధ్యాయాలు …..18
అ కురుక్షేత్రం జరిగినది ……..18
ఈ గురుదశ నన్ను వెన్నంటి వుండే సంవత్సరాలు …18

మనస్సనే కురుక్షేత్రం లో మంచి చెడుల మద్య జరిగే పోరాటం లో
ధర్మాన్ని ఆలంబనగా చేసుకోమని , అందుకు తన పాద పద్మాలను
ఆశ్రయించమని , గురు శాపమనే వంకతో భగవానుడు నాకు అనుక్షణం
తెలియచేస్తున్నట్లు లేదూ

కంసుడు ప్రాణ భయంతో ఎక్కడ చూసిన కృష్ణుడిని కాంచినట్లు , ప్రతి
పనిని ఆరంభించబోయేముందు , తన పాద పద్మాలను ఆశ్రయించమని
గురు శాపమనే నెపం తో కృష్ణుడు నాకు తెలియచేస్తున్నాడు

గీత లో ఆయనే స్వయం గా పేర్కొన్నాడు … గురువులలో దేవగురువు బృహస్పతి
తానేనని . అట్టి నారాయణుని చే ఇవ్వబడిన శాపం నా పాలి వరం కావటం లో
వింతేమున్నది .

అన్నమాచార్యుల వారు కిర్తించినట్లు

శంఖ చక్రాల నడుమ సందుల వైడూర్యమై తానుండగా

కాళిన్దుని తలలపై కప్పిన పుష్యరాగమై తాను ప్రకాసిస్తుండగా

ఇక వేరే రాళ్ళు రత్నాలతో నాకు పని ఏమి
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన భగవద్గీతకు వందనాలతో