Friday, May 30, 2025

నింగిలోని జాబిల్లి

 








నింగిలోని జాబిల్లి నేలపైన సిరిమల్లి

ఏటిలోని చేపపిల్ల అడవిలోని జింకపిల్ల
ఆలుచిప్పలో దాగిన ఆణిముత్యం
పూలతేరులో ఒదిగిన కోమలత్వం
పురి విప్పిన మయూరం 
అరవిచ్చిన మందారం
ఉక్కపోతలో తాకే పిల్లతెమ్మర
ఒంటరి నడకలో తుంటరిగా తాకే చిరుజల్లు
కలసి కలబోసి కనులముందు నిలచిన కలువబాలా నీవు నిలచిన తావు లక్ష్మీనివాసం
హసితచంద్రమా' 

Monday, May 19, 2025

అజ్ఞాతవాసి

 


అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
 నును సిగ్గుల ఎరుపెక్కే చెలి చెక్కిలి ఆనవాలు 
 ముద్ద మందారపు మాటున చిక్కేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 వలపుల గాలం విసిరే నీ వాలు కనుల సోయగం మత్స్యకన్య కంటి మెరుపులో కనబడేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 ముత్యపు మెరుపుల వరుసను ప్రతిఫలించె నీ
 నవ్వుల కిలకిలల జాడ గలగలా సాగే సెలయేటి సవ్వడులలో దొరికేనిదిగో
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 హొయలొలికించె నెచ్చెలి నడక వాన మబ్బుకు 
మురిసి నాట్యమాడే నెమలి నడకలో దాగేనిదిగో 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 పిరుదులపై నాట్యమాడే నీలి కురుల వలపు పాశం 
 బుస కొట్టే నాగు పడగలో నవ్వేనిదిగో
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 చమట గంధం అలుముకున్న నీ దేహ సౌరభం 
 మల్లెల పరిమళాల లో ఒదిగెనిదిగొ 
 అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు 
 నీ ఆనవాలుకై అచట నిచట వెదికి అలసిన మది నా గుండె గూటిలో ఒదిగిన నిన్ను చూసి సేదతీరేనిదిగో

Saturday, May 17, 2025

ఆర్యా ద్విశతీ

 ఆర్యా ద్విశతీ ఇదొక సర్వోత్కృష్ఠమైన కావ్యం

దీనిని భావన చేయగలిగితే వారి శరీరమే మణిద్వీపం అవుతుంది హృదయం చింతామణి
గృహమవుతుంది వారిలోని చైతన్యమే పరదేవత అవుతుంది
 తలచిన మాత్రం చేతనే మనలను పునీతులను చేయు అత్రీ అనసూయ దంపతుల పుత్రుడు రుద్రాంశ సంభూతుడు క్రోథమే అలంకారంగా గల 
మహర్షీ అగు దూర్వాసుడు తాను దర్శించిన అమ్మ లోకాన్ని అందులోని వివిధ దేవతా శక్తులను వారు నివసించే ప్రదేశ విశేషాలను అద్బుతంగా వివరించిన గ్రంధరాజమే ఆర్యా ద్విశతి
 ఆర్యా ద్విశతి భావన చేసిన వారికి  అంబ సాక్షాత్కరించునని నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి కామాక్షీ అవతారమే అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాక్కు
 అట్టి ఆర్యా ద్విశతిని భావనాత్మకంగా వివరించటం  ద్వార నా మనసులో ఆ  మణిద్వీపాన్ని చెరగని విధంగా చిత్రించుకుని తరించే చిరుప్రయత్నమిది

వందసార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసిన ఫలమెక్కువ కదా
ఈ విధంగా అమ్మ యెక్క లోకపు ధ్యానం నిరంతరం చెసే ప్రయత్నం 

Thursday, May 15, 2025

గీతాచార్యుడు


నాది నావారాలను మోహము వీడి నిస్సంగుడ కమ్ము

ప్రోది ఫలాశ వీడి ఫలవృక్షరాజభంగి ప్రయత్నశీలి కమ్ము
మోది జిహ్వచాంచల్యమణిచి నిస్సంశయ శరణార్ధి
కమ్ము
ఇదియే సుఖజీవన మార్గము సవ్యసాచీ అనె సర్వనిలయుడౌ గీతాచార్యుడు

Tuesday, May 13, 2025

సుందరి గోపిక

 సుందర వనముల హృదయ మందిరమందు  నిలచిన కడు
సుందరుడా బాల ముకుందుని ముద్దుమోవిగని విరహమునా  

సుందరి గోపిక మనసుపూదోటలో విరిసిన రస భావమాలికల 
సుందరమగు అక్షర కూర్పుతో అక్షరుని అభిషేకించసాగె  

Monday, May 12, 2025

పగడపు పెదవుల విల్లు

 పగడపు పెదవుల విల్లు విడిచిన ముత్యాల

పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు 
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార 
సంతతముగా నను తడపనిమ్ము నెచ్చెలి

Sunday, May 11, 2025

చెంగావి కుసుమ



 కుంకుమ పరాగమలదిన గుండు మల్లియ మోముతో
మక్కువ జలజపు జల్లుల విరియు కనులతో
చక్కని చిరునగవు వెన్నల తడితో మొరయ
పగడపు పెదవులతో
ఎక్కడ పూచెనీ చెంగావి కుసుమ కోమలి కనులెదుట నిలిచెనీ మనోహరీ