Monday, May 12, 2025

పగడపు పెదవుల విల్లు

 పగడపు పెదవుల విల్లు విడిచిన ముత్యాల

పలువరుస చిరునగవు శరములు మదిని గుచ్చ
వజ్రపు తునక మెరయు సంపంగి నాశికా పరిమళాల మనసు మురియ
ప్రేమ కొలనులో విప్పారిన కలువ కనుల విరిచూపుల జల్లులలో మేని తడువ
పూర్ణచంద్రుని తలపించు మోములో పూయు 
నునుసిగ్గు మొగ్గల వెన్నల కాంతుల వర్షధార 
సంతతముగా నను తడపనిమ్ము నెచ్చెలి

Sunday, May 11, 2025

చెంగావి కుసుమ



 కుంకుమ పరాగమలదిన గుండు మల్లియ మోముతో
మక్కువ జలజపు జల్లుల విరియు కనులతో
చక్కని చిరునగవు వెన్నల తడితో మొరయ
పగడపు పెదవులతో
ఎక్కడ పూచెనీ చెంగావి కుసుమ కోమలి కనులెదుట నిలిచెనీ మనోహరీ

Saturday, May 3, 2025

మాధవుని


 కుంతలము మకరందపరిమళ పుష్పమాలిక చుట్టి 

శిఖముపై పంచెవన్నల మయూఖ  పింఛము నిలిపి
పట్టు పీతాంబరము దాల్చి విహంగ వీక్షణ చేయు 
 మాధవునిచేరె శుకములు మామిడని మాధుర్యము గ్రోల


ముద్దు ముద్దు పల్కుల ముదము గూర్చిన 
శుకముల ఖ్యాతి లోకమున ఇనుమడింప
శుకబ్రహ్మపు నోట ఒలికించె మక్కువతోడ
మధురభాగవత సుధారసధార మాధవుండు

Friday, May 2, 2025

మందార మందారా

 

గులాబి రేకుల పెదవుల చిట్టి సున్నుండ చుట్టి
కలువ కనుల మమ కారపు తేనియ జల్లుతూ
 నెలవంక నగుమోము సిగ్గు మల్లియలు పూయ
నీలపు ఛాయ దాల్చి నిలిచె ముంగిట మందారం

Thursday, April 24, 2025

శుకశారీ


 హరికథాసుధ గానము చేయుచూ నొక శుకము
హరినామామృత బిందులేఖనముతో నొక శారీ
హరిత వన తరువుల ఒడిలో సంవాదుచేసె
హరిలీలావిలాసపు మర్మములెల్ల అనురక్తితో

Friday, April 18, 2025

వెన్నెల రేడు


వెన్నెల రేడు చల్లని చూపుల విప్పారిన కలువ వోలె 
వెన్నుని సంకీర్తనామృత తరంగాలు తనువెల్ల తాక
కన్నుల పారవశ్యభావమొలక హరికి కనురెప్పల 
సన్నిధి చేసే హరిణేక్షణ ఇహలోక వీక్షణ మరచి

Tuesday, April 8, 2025

 కలడు కలడనువాడు కలడో లేడో నని సంశయించిన గజరాజ గమనం వీడి 
కలడు కలడనువాడు లేడని చూపు 
తావే లేదని నిశ్చయాత్మక భక్తి చూపిన
ప్రహ్లదుని దారి పట్టిన జీవితంబులు
ఆహ్లదభరితంబులు చేయడే చక్రి