Saturday, July 19, 2025

ఆహా వర్షం టూ అమ్మో వాన

 కాలం మారుతుంది ఋతువులు గతులు తప్పుతున్నాయి మనలానే 

తొలకరి చిరుజల్లులతో ఆహ్లాదంగా సాగే ఆషాఢం
శ్రావణ మేఘాలతో గర్జిస్తుంది 

బోర్లించిన నిండుకుండలా జోరెత్తాల్సిన శ్రావణం శరత్కాలపు మేఘంలా తెల్లమొగమేస్తే

పొలంగట్టున రైతన్న బిక్కమొహంతో ఆకాశం కేసి 
చూస్తు కూర్చునే పరిస్థితి
అలాంటి వానాకాలపు ఉహా వాస్తవికత మేళవింపుల తాలింపు ఇలా
ఆకాశరాజు హృదయంపై నిలచి నల్లని రంగుతో
మెరయు జవరాలు జలద ప్రేమపొంగు ముత్యాల సరాలై ధారగా జారుతూ

భూమాత ఒడిలో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు మొదలు ఆనుకుని కూర్చున్న నా ఎదపై
తలవాల్చిన గువ్వ నుదిటిపై రాలి అరుణిమ వర్ణమద్దుకున్న ఆ ముత్తెపు బిందువుల ధార గువ్వ నాసికాగ్రమున నిలచి ఓ క్షణం నను తేరిపార చూసి ఒక్క ఉదుటన దుమికి అలివేణి
అధరామృతన్ని తనలో యిముడ్చుకుంటూ కొంటెగా నను చూడగా
దాని గర్వమణచ ముందుకు వంగబోతుండగా

గుండె గుభేల్ మనేలా హోరెత్తిన హారన్ల రొద రసమయ ఊహా జగత్తు నుండి మనసును వాస్తవ
ప్రపంచంలోకి ఈడ్చితే 

ముందు వెనుకల ఎటుచూసినా కిలోమీటరు పొడవునా ఆగిన వాహనాలు
ముందువాడు కదలటానికి అవకాశం లేదని తెలిసి హారన్ల రొదతో మోతెక్కించె వాహనదారులు
కాళ్ళను తాకుతున్నది వాననీరో...డ్రైనేజీ నీరో తెలియని స్థితి
సెంటిమీటరు సందు దొరికితే చాలు ఎలాగోలా 
ట్రాఫిక్ వ్యూహం లోంచి బయటపడాలని ఆతృత పడే టూవీలర్లు

వరదనీరు టైర్లను ముంచెత్తితే దేవుడా కారు ను మాత్రం ముంచెత్తనీవకు అంటూ మనసులో దండాలు పెట్టుకుంటూ బింకంగా కారు నడిపే ఓనర్లు


వీటన్నిటినీ నడమ నావిషయానికొస్తే పొద్దుగాల లేవగానే కమ్ముకున్న కరిమబ్బు చూసి ఆహా వాన దంచేట్టుంది కూసింత సేపు ఆగి వెళదాం అనుకొని అంతలోనే మబ్బులు చీల్చుకుని పెళపెళలాడుతూ వచ్చిన ఎండను చూసి ఉసురుమంటూ ఆఫీసు చేరి 
సాయంకాలం ఆఫీసు ముగిసి బయటకురాగానే
అప్పటివరకు తేటగా వున్న ఆకాశం వున్నట్టుండి 
నల్లబడి ఉరుములు మెరుపులతో హుంకరిస్తుంటే
చుప్పనాతి వాన అని తిట్టుకుంటూ ఒకవైపు
వానలో తడిసిన అనుభూతి  అనుభవిస్తున్న ఆనందం మరోవైపు..

ప్రకృతితో మమేకమవుతూ సహజీవనం చేస్తు సాగిపోతే జీవితం ఆహ్లదభరితమవుతుంది
ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూసాగితే వ్యధాభరితమవుతుంది

Monday, July 14, 2025

క్రిష్ణ నామము

 నిరంతరముగా


క్రిష్ణ నామమును క్రిష్ణ లీలా మహిమను జపించిన

మాయదుమ్ము కమ్మిన హృదయ దర్పణం శరత్కాల పూర్ణిమా బింబమగు

ఆ నామం ప్రాపంచికవిషయ బడబాగ్ని కి దగ్ధమవుతున్న హృదయవనాన్ని చల్లార్చు చల్లని చందనపు వానజల్లు  
ఆ నామం,  భగవత్ జ్ఞానాన్ని దాచుకున్న   కలువ హృదయాన్ని వికసింప చేయుచూ ప్రవహించు చంద్రకాంతి

ఆ నామం, ఓ మనసా  నిను
ఆనంద తరంగాలలో లోతుగా మునకలెత్తించు

నిరంతరం క్రిష్ణ నామాన్ని జపిస్తూ,
అడుగడుగునా క్రిష్ణనామ అమృతాన్ని రుచి చూస్తూ,

అలసిపోయిన ఆత్మలకు ఓదార్పు
 స్నానం చేయించు క్రిష్ణ నామంలో స్నానం చేస్తూ

ప్రతి క్రిష్ణ నామంలో క్రిష్ణశక్తి నివసిస్తుంది.

కాలాలు నిర్ణయించబడలేదు, ఏ ఆచారాలు అవసరం లేదు,
ఓ క్రిష్ణనామ జపానికి,

ఓ క్రిష్ణా నీ దయ చాలా విశాలమైనది.
అని పలికెనీ రాధానామ విరహాంతరంగుడు బంగరు వన్నె మెరయు లక్ష్మీనాధుడా చైతన్యమహాప్రభు నిద్రాణమౌ మా క్రిష్ణచైతన్యము మేల్కొలప


Saturday, July 5, 2025

విఠల విఠల విఠల

 చంద్రభాగా నదీ తరంగాలపై నుండీ వీచే చిరుగాలులు చేయు సవ్వడి...

.

విఠల విఠల విఠల

చంద్రభాగా నదీ జల తరంగాలు చేయు గలగలల సవ్వడి...
.విఠల విఠల విఠల

ఆ గాలులు పీలుస్తూ  ఆ జలాలు సేవిస్తూ  అక్కడ జీవించే ప్రాణకోటి పలికే
తీయని పదం ...విఠల విఠల విఠల

విఠలా విఠలా అని భక్తజనం నోరారా పిలుస్తూ పరవశించిపోయే 
భక్త సులభుడు పుండరీక వరదుడు అయిన పాండురంగడు కొలువైన 
పుణ్యధామం ...చంద్రభాగా తీరాన వున్న పండరీపుర క్షేత్రం  


ఎందరో భక్త శిఖామణులు పాండురంగని ప్రత్యక్ష దివ్యానుభూతిని పొందారు 
అలాంటి వారిలో అగ్రగణ్యులు సమకాలీనులు అయిన నామదేవుడు , జ్ఞాన దేవుడు 
నివృత్తి నాథుడు ,సోపాన్ , ముక్తాబాయి , భక్త కబీరు  మొదలగువారు 

వీరికోవకే చెందిన భక్తురాలు  జనాబాయి   . 5 సంవత్సరాల వయసులో ఆషాఢ శుద్ద ఏకాదశి రోజు మొదటిసారి పాండురంగడిని దర్శించి ఆ రూపాన్ని తన హృదయంలో నింపుకున్న మహానుభావురాలు 

నామదేవుడిని గురువుగా స్వీకరించి ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఇంటిలో 
వసతి పొంది నివసిస్తూ వుండేది 

ఒకరోజు రాత్రి తుఫాను కి నామదేవుడి ఇంటికప్పు ఎగిరిపోతుంటే , సుదర్శన చక్రాన్ని గొడుగులా పెట్టి విఠలుడు స్వయంగా ఇంటి తాటాకు కప్పు సరి చేస్తూ కూర్చున్నారు 

ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన  జనాబాయి   దగ్గరకు విఠలుడు వచ్చి చిరునవ్వుతో ఈ నామదేవుడు నా నామం చెప్పకుండా , రోజు నన్ను దర్శించకుండా , నాకు నైవేద్యం పెట్టకుండా క్షణం కూడా ఉండలేదు .
 ఈ నామదేవుఁడు చేసే కీర్తనలు వింటుంటే నన్ను నేను మర్చిపోతాను అలాంటి నామదేవుడికి కష్టం వస్తే నేను రాకుండా ఎలా వుంటాను  అని చెబుతుంటే ఆయన మాటలని ఆయన రూపాన్ని చూస్తూ అలా తన్మయత్వంతో నిలచిపోయింది  జనాబాయి  . 
ఆ అలికిడి కి నిదుర లేచిన నామదేవుడు స్వామిని చూసి , స్వామి ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి తీసుకోకుండా ఇలా వచ్చారేమిటి అని  ప్రశ్నించగా 
జనాబాయి చేతి వంట తినాలని కోరికతో వచ్చానని స్వామి బదులిస్తారు 
అంతట ఆయన కోరిక మేరకు జనాబాయి వంట పూర్తి చేయగా అందరూ భోజనానికి కూర్చుంటారు.  వారికి వడ్డిస్తూ తనలోతాను బాధపడుతుంది జనాబాయి స్వామితో కలసి భోజనం చేయలేకపోతున్నానే అని . ఆ భక్తురాలి ఆంతరంగం గ్రహించిన విఠలుడు నామదేవా నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత భుజిస్తాను . నా ఆహారాన్ని విడిగా పెట్టి వుంచమని చెప్పగా సరేనని నామదేవుడు తన భోజనం ముగించి స్వామి వారి పాదాలను వత్తుతూ వుంటారు. స్వామి నిదుర రాకున్నా నిదుర పోయినట్లు నటిస్తారు . స్వామి నిదురించారని భావించిన నామదేవుడు తానూ నిదురిస్తారు . అలా అందరూ నిదుర పోయాక విఠలుడు లేచి జనాబాయి ని లేపి తనకు ఆహరం వడ్డించమని అడిగి పెట్టించుకుని జానాబాయి ని పక్కన కూర్చుండ బెట్టుకుని తన చేతులతో స్వయంగా జనాబాయికి తినిపిస్తారు 

అంతటి అదృష్టవంతురాలు ఆ జానాబాయి అంతటి సులభుడా విఠలుడు 

ఆయన రూపం సమ్మోహనాకారం ... అపుడే విరిసిన లేత గులాభీ రెక్కలవంటి పెదవులు .... ఆ పెదవులపై పూచే బొండు మల్లెల వంటి నవ్వులు .... నీటి తుంపరలతో నిండిన కలువల వంటి సజల దయాపూరిత నేత్రాలు ..... అందమైన ఆ ముక్కు .... 
దట్టమైన వానమబ్బు లాంటి ఆ మేని ఛాయ 
తాకగానే చల్లగా సుతిమెత్తగా తగిలే ఆ పాద పద్మాలు ,... 

నడుం మీద చేతులు పెట్టుకుని అందమైన పట్టు పీతాంబరాలు ధరించి ... భుజాలు మీదుగా వచ్చి చేతి మీద అందంగా అమరిన పై వస్త్రం... ఆ ముచ్చటైన తలపాగా .... 

ఇంతందం ఈ లోకంలో ఎక్కడైనా వుందా ... 
ఈ అందాన్ని ఆస్వాదిస్తుంటే.... ఇంకే అందాన్నైనా మనసు కోరుతుందా 
ఆ రూపాన్ని దర్శించాలంటే కావాల్సింది తపన ...ఎలాంటి తపన అంటే... 
తొలిసారి ప్రేమలో పడిన యువతీ యువకులు ఒకరినొకరు చూ సుకోవటానికి 
ఎంత తపన పడతారో .... ఆ మాత్రం చాలు ... 

విఠల విఠల విఠల పాండురంగ విఠల