Thursday, April 24, 2025
Friday, April 18, 2025
Tuesday, April 8, 2025
Saturday, April 5, 2025
కలువల ప్రియుని
నిర్మలాకాశసౌధంబులో నక్షత్రమాలికాభరణముల్
దాల్చిన కలువల ప్రియుని కులభూషణుడు బంగరు వేణియపై నిరతమాలపించు ఆనంద గమకములే విశ్వగమనపు నిర్ధేశకంబులాయే
వెన్నుని పిల్లనగ్రోవి పిలుపుతో విరిసిన తారకలతో తోయదమండలమెల్ల మెరియ ముకుందుని మోము పై వీచు ఆనందపారవశ్యపు తెమ్మెరలతో కలువలరేడు పసిడి కాంతులీన భావించు లక్ష్మీకిరణుల మానసాకాశంబు వహ్నిమండల వాసినీ విహారస్థలంబాయే
శ్రీమాన్
భగవన్నామ సంకీర్తన అను తపస్సు నందు , వేదములను శాస్త్రములను అధ్యయనం చేయుట యందు అమితమైన ఆసక్తికలవాడు , తపస్వీ జ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠుడు అయినా నారద మహర్షిని వాల్మీకి ముని పుంగవుడు ఇలా ప్రశ్నించెను
ఈ లోకంలో ఈ కాలంలో (ప్రశ్న వేసే సమయానికి లోకంలో ఉన్నటువంటి
1 ) గుణవంతుడు
2 ) వీర్యవంతుడు (వికారములను జయించినవాడు)
3 ) ధర్మజ్ఞుడు
4 ) కృతజ్ఞుడు
5 ) సత్యవాక్కుడు
6) దృఢవ్రతుడు ( చేసిన సంకల్పానికి కట్టుబడి వుండేవాడు )
7 ) చారిత్రముతో నడుచువాడు ( ఆచార సంప్రదాయములు గౌరవించేవాడు )
8) సర్వ భూతములకు (జీవులకు) హితము కలిగించువాడు
9 ) విద్వాంసుడు
10) సమర్ధుడు
11) ఏకప్రియదర్శనుడు (ఏ సమయంలో చూసినను మనసుకు ఆహ్లాదం కలిగించువాడు )
12 ) ఆత్మవంతుడు (ఆత్మజ్ఞానం కలిగినవాడు)
13 ) జిత క్రోధుడు (కోపాన్ని జయించినవాడు )
14 ) ద్యుతి మంతుడు ( చక్కని కాంతి తో కూడిన రూపలావణ్యములు కలవాడు)
15 ) అసూయ లేనివాడు
16) యుద్ధంలో ఎవనికి కోపం కలిగితే దేవతలు కూడా భయపడుదురో అట్టి నరుడు ఎవ్వరు?పదహారు లక్షణాలు కలిగిన పరిపూర్ణ మానవుడు ఈ సమయంలో ఎవరైనా వున్నారా అని వాల్మీకి మహర్షి ప్రశ్న
దానికి సమాధానంగా నారద మహర్షి ఇక్ష్వాకు వంశమునందు జన్మించినట్టి వాడు ప్రజలందరి మన్ననలు పొందిన రాముడను ప్రభువు కలడు అంటూ రాముని యొక్క లక్షణాలను వివరించసాగిరి
1) నియతాత్ముడు (అసాధారణమైన దివ్య మంగళ విగ్రహ రూపం కలవాడు)
2) మహా వీర్యుడు (తనను మించిన వీరుడెవ్వడు లేనట్టివాఁడు )
3) ద్యుతి మంతుడు ( చక్కని కాంతి తో కూడిన రూపలావణ్యములు కలవాడు)
4) ధృతిమంతుడు (తన శాసనముకు అధీనమై నడుచు లోకము కలిగి వున్నట్టివాడు )
5 ) వశీ ( తన ఇంద్రియములను తన అధీనంలో వుంచుకున్నవాడు , సర్వ జీవులను గుణములచేత తన వశం చేసుకున్నవాడు )
6) బుద్ధిమంతుడు (అన్ని విషయములందు పరిపూర్ణ పరిజ్ఞానం కలిగినవాడు )
7) నీతిమంతుడు (సృష్టి ని క్రమ పద్దతిలో నడుపుటకు అవసరమైన నీతి మర్యాద కలిగినవాడు)
8) వాగ్మీ (ప్రశస్తమైన మంగళకరమైన సంతోషం కలిగించు వాక్కు కలవాడు)
9) శ్రీమాన్ (శ్రీమంతుడు, సమృద్ధము నిత్యము అయినట్టి సంపద కలిగినవాడు )
10) శత్రు నిబర్హణుడు (బాహ్య మరియు ఆంతరంగిక ( శరీరమునకు మనసుకు ఆపద కలిగించు )శత్రువులను సంహరించినవాడు)
11) విపులాంసుడు (విశాలమైన ఎత్తైన భుజములు యొక్క పై భాగం కలిగినవాడు ; చంకలు ,వక్షస్థలం , కడుపు, ముక్కు, భుజ స్కంధములు , నుదురు ఎవరి యందు విశాలంగా వుండునో వారు ఎల్లప్పుడూ సుఖములు పొందుదురు )
12) మహాబాహు (పొడవైన గొప్ప భుజములు కలవాడు, నున్నని బలమైన మోకాళ్లవరకు విస్తరించు బాహువులు కలిగినవారు గొప్ప చక్రవర్తి అగును )
13) కంబుగ్రీవ (శంఖము వంటి మెడ కలవాడు మూడు రేఖలతో విరాజిల్లు అందమైన మెడ )
14) మహాహనుః ( గొప్ప దవడలు కలవాడు, చక్కని దవడలతో నున్నవారు ఎల్లప్పుడూ మంచి ఆహరం భుజించగలరు అంతే కాక ఆయువున్నంతవరకు సుఖపడుదురు )
15) మహోరస్కుడు (విశాలమైన వక్షస్థలం కలిగినవాడు )
16) మహేష్వాసుడు (గొప్ప విల్లు ధరించి యుండు గొప్ప విలుకాడు )
17) గూఢజత్రు: ( కనబడని మూపుల సంధులు (ఎముకలు) కలవాడు ఆరోగ్య చిహ్నం )
18) అరిందమః (శతృవులను పాపములను నశింపచేయువాడు )
19) ఆజానుబాహు (మోకాళ్ళ వరకూ విస్తరించిన భుజములు కలవాడు )
20) స్సుశిరా (సమమైన గుండ్రని ఛత్రము వంటి శిరము కలవాడు ; ఏకఛత్రాధిపత్యముతో భూమిని పాలించగల దీర్ఘాయువు కల లక్షణము )
21) స్సులలాట ( మంచి వెడల్పైన నుదురు కలవాడు; రాజ చిహ్నం)
22) స్సువిక్రమః ( సుందరమైన నడక కలవాడు ; ఎవరి నడక సింహము వృషభము ఏనుగు పెద్దపులి వీటిని పోలియుండు నో వారు అన్నిటా విజయము పొంది సుఖింతురు )
23) సమ (మిక్కిలి పొడుగు మిక్కిలి పొట్టి కాక వుండువాడు , తొంబదిఆరు అంగుళాల ఎత్తు సార్వభౌమత్వమునకు చిహ్నం )
24) స్సమవిభక్తంగుడు ( ఏ అవయవము ఎంత పరిమాణంలో వుండిన చూచుటకు అందంగా వుండునో ఆయా అవయవములు ఆయా పరిమాణంలో వున్నవాడు ; కనుబొమలు ముక్కు రంధ్రములు కనులు చెవులు పెదవులు చనుమొనలు మోచేతులు చేతి మణికట్టులు మోకాళ్ళు వృషణములు పిరుదులు చేతులు కాళ్ళు పిరుదుల పైభాగం ఇవి ఎవరికి సమముగా వుండునో అతడు ప్రభువు అగును )
25) స్నిగ్ధవర్ణుడు (మెరుపు వర్ణము కలవాడు ఆకర్షణీయమైన వర్ణం కలవాడు ; కనుల యందలి మెరుపు సౌభాగ్యాన్ని; దంతములు యందలి మెరుపు భోజన సౌఖ్యాన్ని , చర్మము యొక్క మెరుపు శయ్యాసౌఖ్యాన్ని , పాదముల యందలి మెరుపు వాహన సౌఖ్యాన్ని సూచిస్తుంది )
26) ప్రతాపవాన్ ( తేజస్సు తో అలరారువాడు )
27) పీనవక్షుడు ( బలమైన వక్షస్థలం కలవాడు )
28) విశాలాక్షుడు ( తామర రేకులవంటి విశాలమైన కనులు కలవాడు)
29) లక్ష్మీవాన్ ( సర్వాంగ సుందరుడు )
30) శుభ లక్షణః ( సమస్తమైన శుభ లక్షణములు కలవాడు)
31) ధర్మజ్ఞుడు (శరణు కోరిన వారిని వదలని స్వభావం కలవాడు )
32) సత్య సంధుడు ( ఆడిన మాట తప్పనివాడు )
33) ప్రజలకు హితం చేయుట యందు ఆసక్తి కలవాడు
34) యశస్వీ ( ఆశ్రయించిన వారిని రక్షించుటలో గొప్ప కీర్తి కలవాడు )
35) జ్ఞానసంపన్నుడు
36) శుచి (మంగళకరమైన పవిత్రమైన వాటికి కూడా మంగళత్వాన్ని పవిత్రతను చేకూర్చగల పరిశుద్ధమైన నడవడిక కలవాడు)
37) వశ్య ( ఆశ్రయించినవారికి లోబడివుండువాడు )
38 ) స్సమాధిమాన్ ( ఆశ్రయించినవారిని రక్షించు ఆలోచనయే ఆదిగా కలవాడు )
39) ప్రజాపతి సమ (బ్రహ్మ సమానుడు )
40) శ్రీమాన్ ( శ్రీమంతుడు )
41) ధాత (సర్వ జీవులను పోషించువాడు )
42) రిపు నిషూదనః (శత్రువులను సంహరించువాడు)
43) జీవ లోకమును రక్షించువాడు
44) ధర్మమును రక్షించువాడు
45) స్వధర్మ రక్షకుడు
46) స్వజనులను రక్షించువాడు
47) వేద వేదాంగ తత్వజ్ఞుడు
48) ధనుర్వేదము (విలువిద్య) నందు నిష్ఠ ప్రావీణ్యము కలవాడు
49) సర్వ శాస్త్రములు యొక్క అర్ధము రహస్యములు తెలిసినవాడు
50) స్మృతిమంతుడు (జ్ఞానము నందు మరుపు లేనివాడు)
51) ప్రతిభావంతుడు
52) సర్వ లోక ప్రియుడు
53) సాధువు
54) అదీనాత్మా ( దైన్యము లేని వాడు )
55) విచక్షణా జ్ఞానము కలవాడు
56) నదులు సముద్రమును చేరు నట్లు సత్పురుషులచే ఎల్లప్పుడూ పొందబడువాడు
57) ఆర్యుడు (పూజించదగినవాడు )
58) సర్వ సముడు (అందరిని సమ భావంతో చూచువాడు)
59) సదైక ప్రియ దర్శనుడు ( చూడగానే ప్రియము కలిగించువాడు)
60) సర్వ గుణోపేతుడు (సకల కల్యాణ గుణములు కలవాడు )
61) కౌసల్యానంద వర్ధనుడు ( కౌసల్య యొక్క ఆనందమును పెంపొందించువాడు )
62) సముద్రము వంటి గాంభీర్యము కలవాడు (తనలోని సంపదను సముద్రుడు ఎట్లు బయటకు కనబడనీయకుండునో అట్లే తనలోని భావాలను బయటకు వ్యక్తం కానీయనివాడు )
63) హిమవంతునివలె ధైర్యము కలవాడు (వర్షములు పిడుగులతో కొట్టబడుచున్నప్పటికీ గిరులు చలించనట్లు ఆపదలు చుట్టిముట్టినను ధైర్యము కోల్పోని స్వభావం)
64) విష్ణువుతో సముడైన వీర్యము కలవాడు
65) చంద్రుని వలె చూడగానే ఆహ్లాదం కలిగించువాడు
66) క్రోథమునందు కాలాగ్ని సముడు
67) క్షమాగుణంలో పృథ్వి సముడు
68) త్యాగమునందు కుబేరుని వంటి వాడు
69) సత్యమునందు అపర ధర్మ దేవత వంటివాడు
పదహారు లక్షణాలు కల మానవుడి గురించివాల్మీకి మహర్షి అడిగితే అరువది తొమ్మిది లక్షణాలు కల పరిపూర్ణుడైన శ్రీరాముని చూపించారు నారద మహర్షి
Tuesday, April 1, 2025
Subscribe to:
Posts (Atom)