మార్గశీర్ష శుద్ధ త్రయోదశి
మార్గశిర మాసమే ప్రత్యేకం. శ్రీకృష్ణమాసం. శివ పార్వతుల కళ్యాణం జరిగిన మాసం. శరవణ భవుడు ఉదయించిన మాసం . దత్తాత్రేయ గురువరేణ్యుడు జనించిన మాసం. శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అర్జునుని ముఖతా గీత భోధించిన మాసం
అట్టి ఈ మాసంలో శుద్ధ త్రయోదశీ ప్రత్యేకమైనది. ఈ రోజు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు సువర్చల ను హనుమకు ప్రసాదించిన రోజు. సువర్చల అంటే చక్కని వర్చస్సు కలిగినది అని. అంటే చక్కని ముఖకాంతి ఎవరికి వుంటుంది. ఎవరికి సుజ్ఞానం
వుంటుందో వారికే సువర్చస్సు వుంటుంది. జ్ఞాన ప్రదాత అయిన సూర్యభగవానుడు హనుమకు చక్కని జ్ఞానం ప్రసాదించిన రోజు ఈరోజు. సువర్చస్సుతో కూడినవాడు కనుకే హనుమ అందరికీ ఇష్టుడు.
(
అలాగే ఇదేరోజు హనుమ అశోకవనంలో శింశుపా వృక్షం కింద సీతమ్మను దర్శించిన రోజు. శ్రీరామ వియోగ దుఃఖభారంతో వున్న సీతమ్మకు రాముని అంగుళీయకాన్నిచ్చి సంతోషం కలిగించిన రోజు ఈరోజు. అందుకే హనుమను ఉద్దేశించి సీతమ్మ పలికిన ఈ పలుకులే మహామంత్రమై మనలను ఎల్లవేళలా కాపాడతాయి.
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ||
ఓ కపిశ్రేష్టుడా కార్యములను సమర్ధవంతంగా నిర్వహించుటకు నీవే అత్యుత్తమ ప్రమాణము(ఉదాహరణ). ఓ హనుమా నీవే ప్రయత్నపూర్వకంగా మా దుఃఖములను తొలగించుము.
మన హృదయమనే అశోకవనం (ఎల్లప్పుడూ ఆనందంగా వుండటం హృదయం యొక్క సహజ స్వభావం ) లో నివసించే చైతన్యస్వరూపమైన శక్తి మోహమనే రావణమాయ తో కప్పబడి మన మనసు వివిధమైన వ్యాకులతలకు లోనవుతుంది .
సుజ్ఞానమనే శ్రీరామ భక్తిని ఆశ్రయించిన బుద్ధికుశలత అనెడి కార్యశీలుడగు హనుమ
తన ప్రయత్నబలంచేత మన హృదయకుహరాన్ని కప్పివేసిన మోహపు రావణుడిని తొలగించి హృదయ అశోకవనిలో కొలువైవున్న చైతన్యస్వరూపాన్ని ప్రజ్వలింపచే సుకుంటే ఆ దేహమే అయోధ్య . ఆ మనోమందిరమే శ్రీరామ అంతఃపురం .
