Tuesday, October 17, 2023
అమ్మా భవానీ
ఉదయం 3 గంటల నుంచి సుమారు 100 కి మీ దూరం నుండే రోడ్ల మీద యువకుల గుంపుల కోలాహలం
చేతిలో కాగడాలు ధరించి పరుగులు తీస్తూ కొందరు బైక్ సవారీ చేస్తూ కొందరు వారిని చూస్తూ ఆశ్చర్యపోతూ నేను
అందరి గమనం ఒకచోటకే ....... అదే ఆత్మశక్తి స్వరూపిణి భవానీ మాత కొలువైన కొండ ..తుల్జాపూర్ భవానీ క్షేత్రం
శయనముద్ర లో యోగనిద్ర లో వున్న అమ్మ భవానీ దర్శనం చేసుకుని అక్కడ నుండి పండరీపురం చేరుకున్నాం
తొలిసారి ప్రేమలో పడ్డ యువతీ యువకులు ఒకరి రూపం పట్ల మరొకరు ఎంత తన్మయ భావంతో వుంటారో
అంతలా ఎంతసేపు చూసినా ఎన్నిసార్లు చూసినా తనివితీరని రూపం మా ఇష్ట సఖుడు ఆ విఠలుడి పాదాలకు
నమస్కరించి కొల్హాపుర మహాలక్ష్మి ధామం చేరుకున్న
ఉదయం 6 . 30 కి క్యూ లైన్ లోకి చేరిన. అక్కడ క్యూ లైన్ లోకి చేరాక మనసులో పుట్టిన ఆలోచనల అక్షర రూపం
భవానీ మందిరంలో క్యూ లైన్
హైదరాబాద్ ఆర్డినరీ సిటీ బస్సుల్లో , కాలేజీ టైమింగ్స్ లో ఫుట్ బోర్డు ప్రయాణాలను మరిపించేలా
ఓ అరటి పండు, కొన్ని మురమరాలు, చుట్ట చుట్టి పడగ విప్పి వున్న పాము ను తలపించేలా వస్త్రం తో
చేయబడిన దీపపు వత్తిని కొద్దిసేపు వెలిగించి తరువాత తరువాత దాని ఆర్పి మసి అంచుతో వున్న ఆ వత్తి
వీటిని వెదురు బుట్టల్లో పెట్టుకుని ఆ వెదురు బుట్టలు నెత్తిన పెట్టి జడలు కట్టిన జుట్టుతో ముతక చీరలు కట్టి
పక్కా మాస్ అనిపించేలా తోసుకుంటూ పోతున్న స్త్రీల గుంపు
కొల్హాపూర్ క్యూలైన్
రద్దీ వున్నా అలసట తెలియనీయని హైదరాబాద్ మెట్రో ప్రయాణంలా
దివి నుండి దిగివచ్చారా అన్నట్లు పాల మీగడ వంటి మేని కాంతులతో గుబాళించే సెంటూ స్ప్రేల తో తళుకు బెళుకుల చీరలు కట్టి
పట్టుకుంటే కందిపోతాయా అనిపించే ఆ సుకుమారమైన చేతుల్లో
అప్పుడే కొన్న స్టీల్ ప్లేట్స్ లో ఓ చీర ,పూలు గాజులు పెట్టి అలవోకగా అలానడిచి వెళుతుంటే అనేక రాజ హంసల సమూహం పక్కనుండి సాగిపోతున్నట్లు
వెళ్ళింది అమ్మను చూడటానికా అమ్మాయిలను చూడటానికా అని అనుకోకండే
ఆడవాళ్ళ గురించే కానీ మగ పుంగవుల గురించి చెప్పటానికి ఏమీ లేదిక్కడ .
ద్వాపరం వరకు స్త్రీ పురుషుడిని అనుసరిస్తూ సాగింది . తగ్గట్టుగా ధర్మము వర్ధిల్లింది
కలి ... స్త్రీని అనుసరిస్తూ పురుషుడు సాగుతున్నాడు ... ఎక్కువ చర్చ చేయటం మంచిదికాదు వదిలేద్దాం
పురుషుడు జఢమ్ స్థిర స్వభావి . స్త్రీ ప్రకృతి స్వరూపిణి చలన శీలి
ప్రకృతి పురుషుడిని ఆలంబనగా చేసుకుని సాగితే అది స్థిర చలనం ఆనంద కారకం అందుకు విరుద్ధంగా జరిగితే అది దుఃఖ కారకం
భవానీ మందిరంలో క్యూ లైన్
జై జై భవానీ ... ఓ యువకుడి పెనుకేక జై జై శివాజీ .... ప్రతిగా ఓ పదిమంది యువకుల గుంపు స్పందన చెవుల్లో తుప్పు వదిలేలా
భవానీ.. అమ్మ ... ఆత్మ శక్తి ప్రతిరూపం
ఆ తల్లి ఆ ఆత్మ శక్తి ని పుణికి పుచ్చుకున్న వీర తనయుడు శివాజీ మహారాజా
ఆ యోధుడి పట్ల ఇప్పటికి మరాఠా యువతలో వున్న గాఢమైన ఆ ప్రేమ బంధం అమోఘం
కావాల్సిందల్లా వారి ఉత్సాహాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దగల సమర్ధ రామదాసు వంటి గురువు . కానీ అలాంటి యోగ్యులు ఇపుడు కరువు
మరి మన తెలుగోళ్లకు శివాజీ వంటి యోధులు లేరా.. ?శాతవాహనులు , శ్రీకృష్ణ దేవరాయలు ... వీరి పట్ల మనకున్న గౌరవభావం ఏపాటిది
కొల్హాపూర్ క్యూలైన్
వచ్చింది అమ్మ దర్శనానికీ చేస్తుంది ఐఫోన్స్ లో సాంగ్స్ వింటూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ క్రికెట్ చూస్తూ....
ఒకరివెనుక ఒకరు బుద్ధిమంతుల్లా తలలు ఫోనుల్లో పెట్టి అలా సాగిపోతూ.. ధనం మూలం ఇదం జగత్ అన్నదానికి నిదర్శనంలా
ఆహా భవానీ మాత ఆ తల్లికి తగ్గట్టుగానే అక్కడి భక్త సమూహం కొల్హాపూర్ మహాలక్ష్మి ఈ తల్లికి తగ్గట్టుగా ఇక్కడి భక్త జనం
ఇవన్నీ కాదు కానీ
ఓ వైపు శక్తి స్వరూపిణి కాళికామాత
మరోవైపు జ్ఞాన స్వరూపిణి సరస్వతి మాత
నడుమ ఐశ్వర్య ప్రదాయిని అమ్మ మహాలక్ష్మి
ఆ కొల్హాపుర ధామ వైభవం అద్భుతం
మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ: విశ్వమంగళం
Subscribe to:
Posts (Atom)