Monday, August 10, 2020
అలల ఒడిలో
జీవితంలో మొదటిసారి అయ్యో అనిపించింది చదువులో సాధించిన మార్కుల విషయంలో వాటి గురించి ఆలోచించటం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా
డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక , మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లో వంద మార్కులు వచ్చాక ,కాస్ట్ అకౌంటెన్సీ లో కూడా వంద వస్తాయనుకున్న తీరా చూస్తే 80 మాత్రమే వచ్చాయి మొదటిసారి మనసు చివుక్కుమంది ఏమైయ్యుంటుంది వ్రాసిన కాస్ట్ అకౌంటెన్సీ పేపర్ ఓసారి జ్ఞాపకం చేసుకుంటే , ఆరోజు ఎదో బాలయ్య మూవీ కి వెళ్లాలన్న హడావుడి లో సమయం ఇంకా చాలా మిగిలి వుండగానే ఆన్సర్ పేపర్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవటం తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తే ప్రాసెస్ కాస్టింగ్ లో ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కి ఓపెనింగ్ బాలన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం మరచితిమి వెంటనే పెదవులపై ఒక చిరునవ్వు . మనసులోని దిగులు మటుమాయం చదువుల కాలం ముగిసింది. జీవితపు పరీక్షా కాలం మొదలైంది
గుంటూరు లోనే ఆడిటర్ పున్నయ్య చౌదరి గారి ఆఫీస్ లో చేరటం , ఆడిట్ పనుల మీద ఊళ్ళు పట్టుకు తిరగటం
ఆ క్రమంలో మొదటిసారి హైదరాబాద్ రావటం జరిగింది . నాతో వుండే సీనియర్ మిత్రుడు సాయంత్రం అవ్వగానే ట్యాంకుబండ్ వద్దకు తీసుకు వచ్చేవాడు . అక్కడ వీచే మురికి గాలుల వాసనకు ముక్కులు ఉక్కిరి బిక్కిరి ఐతే , ఆ ప్రాంతం చుట్టూ షికారుకు తిరిగే మనుషులను చూసి మనసు ఉక్కిరి బిక్కిరి అయ్యింది అపుడే నిర్ణయించా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రాకూడదని . (హతవిధీ! భగవానుడు తన్నిన తన్నుకు ఎగిరొచ్చిపడి భాగ్యనగరంలో పడితి )
అక్కడ షికారు ముగియగానే చిక్కడపల్లి లో కమ్మని భోజనం ఆరగించి అటునుండి ఆటే మహేశ్వరీ థియేటర్ కి ...... దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే భాష రాదు కానీ అద్భుతంగా నటించిన షారుఖ్ కాజోల్ ల ఉత్సాహభరితమైన ప్రణయగీతం వరుసగా ఏడురోజులు సెకండ్ షో కి వెళ్ళటం ఇసుమంతైనా విసుగనిపించకపోవటం
ఆ తరువాత పయనం విశాఖపట్టణం . ఆఫీస్ పని ముగియగానే సాయంత్రాలు సాగర తీరంలో ఇసుక తిన్నెలపై సేద తీరుతూ ఎగసి పడే అలలు చూస్తూ వేడి వేడి మిక్చర్ ఆరగిస్తూ, నిశీధివేళ సముద్రుడి ఘోష హృదయంలో సుడులు తిరుగుతుంటే వచ్చే కిక్కు ఏ ఆర్ రహ్మాన్ బీట్ ఇస్తుందా ఇళయరాజా సంగీతమిస్తుందా చేతిలోని ఐస్ క్రీం కరిగిపోతుంది కాళ్ళ కింద ఇసుక అలల తాకిడికి కదిలిపోతుంది కాలం గడచిపోతుంది కానీ సముద్రుడి ఘోషలో లీనమైన మనస్సు మాత్రం వెనుకకు రాదు అదే సముద్రుడి గొప్పతనం ఆర్కే బీచ్ రోడ్ నుండి ఋషి కొండ మీదుగా సాగర తీరం వెంబడి భీమిలి బీచ్ వరకు ఉల్లాసంగాబైక్ మీద సాగిపోతుంటే అదొ సరదా ... మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది బైక్ మీద భామ అయితే లేదు కానీ ఆ జర్నీ ఇచ్చే కిక్కుంది రుషికొండ సమీపంలో సరుగుడు చెట్ల తోట పక్కనే బీచ్ చాలా అందంగా వుంటుంది . మాతో వచ్చినవాళ్లు , ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ ,స్టాఫ్ కలసి ఆ తోటలో మందు, ముక్క పెట్టుకుని పేక
ఆడుతుంటే నేనలా సాగరపు ఒద్దు చేరుకున్నా
అక్కడ ఆ సాగరంలో నున్నని నల్లని శిలలు నా మనసు ని ఆకర్షించాయి . వెళ్లి ఆ శిలల పై కూర్చున్నా . ఒక్కో అల అలా వచ్చి ఇలా ఈ రాళ్లను సుతారంగా తాకి వెళుతుంటే ప్రేయసి పాదాలను తాకి మురిసిపోయే ప్రేమికుడి అంతరంగంలా ఆ అలల తరంగాలు నా మనసును హత్తుకున్నాయి
సమయం గడుస్తున్నకొద్దీ అలల వేగం కొద్ది కొద్దిగా పెరగసాగింది . సుతారంగా శిలలను తాకి వెనుకకు మరలిన అలలు రెట్టించిన ఉత్సాహంతో ,ప్రేయసి పాదాలు ముద్దాడి మురిసిన ప్రియుడు మరింత ప్రేమగా ప్రియురాలి నుదురు ముద్దాడ వేగిర పడినట్లుగా కడువేగంతో ఎగసిపడుతూ వచ్చి ఆ శిలల శిఖరాన్ని తాకసాగాయి
అప్పటివరకు ఆ అలల తడి నా పాదాల వరకే పరిమితం కాగా , సమయం గడుస్తున్న కొద్దీ , పొద్దు గుంకుతున్న వేళ ఆకాశంలో రాబోయే చందురుని కోసం ఆశగా ఎదురుచూస్తూఆ చందురుని అందుకోవాలని ఆబగా ఎగిరెగిరిపడుతున్న అలల ఝడి క్రమక్రమంగా నా మోకాళ్ళను దాటి నా నుదురు తాకుతుంటే ఆ అలల తరంగాలతో మమేకమైన నా ఆలోచనా తరంగాలు కదిలిపోతున్న కాలాన్ని గాని రాబోతున్న ప్రమాదాన్ని గాని గుర్తించే మెలుకువ లో లేదు
ఇంతలో పెద్దగా సముద్రుడి ఘోషను కూడా దాటుకుని ఆ తరంగాలతో లీనమైన నా మనసును
కుదుపుకు గురి చేస్తూ పెద్దగా అరుపులు ఏమిటా అని వెనుకకు తిరిగితే ఒడ్డున నిలబడి మా వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు బయటకు రా రమ్మని , అపుడు అర్ధమైంది నేనొచ్చి చాలా సమయం గడిచిపోయిందని అలల వేగం క్రమేపి ప్రమాదకరంగా మారుతుందని . ఒడ్డుకు వచ్చి చూస్తే వాళ్ళ ముఖాల్లో ఆందోళన ... ఏమున్నదబ్బా వాళ్ళు వాళ్లకిష్టమైన పేకాటలో మునిగిపోయారు ,నేనేమో నాకు ఇష్టుడైన సముద్రుడితో మమేకమై పోయాను
సముద్రం అదొక అద్భుతం . సముద్రుడి అలలకు మనిషి ఆలోచనలకు అలుపు లేదు నిరంతరం అవి సాగుతూనే ఉంటాయి . సాగర గర్భంలా మనిషి మనసు కూడా లోతు తెలియనిదే . సముద్రాన్ని పోలినదే మన మెదడు కూడా . రెంటికి ఉన్న గొప్ప లక్షణం దృశ్య రూపకం గా చూడగలగటం . నీటికి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి వుంది అదే విధంగా మన మెదడు కూడా తన ఊహకు అందిన విషయానికి దృశ్య రూపం ఇవ్వగలదు అంతేనా లక్ష్మీమ్ క్షీర సముద్రరాజ తనయాం అని కీర్తిస్తాం , జయ జనని సుధా సముద్రాంత రుధ్యన్మణి ద్వీప సంరూఢ అంటారు అమ్మ శ్యామలను అదేవిధంగా మన మనస్సనెడి సముద్రంలో అమ్మను చూస్తాం
అందుకే సముద్రుడిని చూస్తే అంతలా ప్రేమలో పడతాం ... తనివి తీరలేదు నా మనసు నిండలేదు ఏనాటి బంధమో సాగరమా మనది .....
Subscribe to:
Posts (Atom)