Saturday, February 22, 2014

అరుణాచల అక్షర మణిమాలకు

అరుణా చలునికి అక్షరమాల లొసగ 
అక్షరసుమాలు  కూర్పు నేర్పు నొసగవయ్య గణపతి 

గర్వము తొలిగించుము అరుణాచల 
మీ పై దృష్టి నిలుపు వారలకు 

అందము సుందరమూ ఒక్కటౌ చందముగా 
నా మనంబే అరుణాచలంబు అరుణగిరీశా  

నా మదిలోనికి జొచ్చి నీ దాసుడిగా నన్ను మలచి 
నీ మదిలో నన్ను ఖైదు చేసితివో కరుణాచల అరుణాచల 

భూమికి భారమౌ బ్రతుకునిచ్చి ఆపై త్రుంచి తప్పు దిద్దుకున్నను 
లోకులు నీదు తప్పందురు అరుణాచల  

తప్పును సరిదిద్దుకున్నచో  అరుణగిరీశా  
నిన్ను విడిచి వుండు వారలెవరయ్య అరుణాచల 

అమ్మ నెరుగని నీవు దయా స్వరూపమగు అమ్మ నిచ్చితివు మాకు 
అదియు నీ దయయే కదా దయాద్రీశ అరుణాచల 

అలల వలె అలుపెరుగక చలించు నా మానస సరోవరములో 
గిరుల వలె స్థిరముగా నిలువుమా అరుణాచల 

నీ అందం కాంచిన కన్నులు ఇతరముల కోరక 
నిన్నే కోరును కనుమా అరుణాచల 

 సమకాలికులు సరిజోడు నీకెవ్వరు నీవుకాక 
ఆద్యంత రహితుడా అరుణాచల 

నరుడి వై నడిచుండినచో నా గర్వ మణిచి నను 
నీలో కలిపి వుండేడి వాడవు కాదా అరుణాచల 

విషయవాసనల సుడిలో అల్లాడుతు నేనుంటే 
ముసి ముసి నవ్వులతో మురిసేవు న్యాయమా అరుణాచల 

నీ మాయ కాక వేరెట్టిది నీ రూపు నా కనులపడక 
మరుగ పరచగలదు మాయాధీశ అరుణాచల
 
పంచేద్రియ చోరులు నాలో చొచ్చెడి వేళ పరధ్యాన 
మందుండితివా పరమాత్మ అరుణాచల 

తల్లి ప్రేమ నోసగిననే సరి కాదు తండ్రి 
వలె దండించు భారమూ నీదెగా అరుణాచల 

నీటిని విడువజాలని పాలలా నన్నెన్నడు 
వీడబోకు అరుణాచల 

దయాసాగరాన్ని  దాచుకున్న దయాగిరి 
నాపై దయ చూపవయ్యా అరుణాచల 

పాప పుణ్య కర్ముల హృదయాలలో ఒక్క తీరుగా ప్రకాశించు మణి 
నాలోని పాప గుణాలను దహించుమయ్య అరుణాచల 

నా తప్పులన్నీ త్రుంచి వేసి సద్గుణుడిగా మార్చవయ్యా 
సద్గురు స్వరూప అరుణాచల  

చుర కత్తుల బోలిన చెడు కార్యాల బడనీయక
 మము చేదుకోవయ్య దయా స్వరూప అరుణాచల 

సానుభూతి వదిలి అత్మస్థైర్య మీయవయ్యా 
అఖిలాంతరంగా అరుణాచల 

సత్యమేదో నిత్యమేదో ఎరుకపరచి ఎల్లలెరుగని 
ఆనందమీయవయ్య అరుణాచల 

నీ అనుగ్రహమందగా నే ఏ ఘనకార్యము చేసియుంటినో 
ఆగ్రహమెరుగని అరుణాచల 

గౌతమార్చిత దయాగిరీ నీ దయాపూరిత నేత్రాలతో 
ఆశీస్సులందిచవయ్యా అరుణాచల 

నా మనో కమలాన్ని వికసింప చేయవయ్య 
జ్యోతి స్వరూపా అరుణాచల 

ఆనందాన్వేషణలో నీ తోడు కోరగా నీ పాదాలు 
నా హృదయపద్మం లో నిలిపి నిరతిశయాన్నొసగితివి కదా అరుణాచల 

చంద్రశేఖరా నీ చల్లని కిరణాల స్పర్శతో నా మనంబు నిర్మలంబై 
జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నవి అరుణాచల 

నను కమ్ముకున్న మాయ పొరలు తొలగించి నీ దయాతెరలు నాకు తగిలించి 
నన్నాదుకోవయ్యా అరుణాచల 
 
మాట తడబడగా  ఆలోచనలు ఆగిపోగా  మది నిండుగా నీ రూపం 
నిలువనిండు నిత్య నిర్మలా అరుణాచల 

అల్పుడ నేను మోసగించబోకు నీ మాయచేత 
జ్ఞాన కాంతులు ప్రసరింప చేయి నా మదిలో అరుణాచల 

బ్రాంతి కలిగించు బాటలందు నను నడవనీకు 
నీ పాదాలు చేరు దారులు నాకు చూపు అరుణాచల 

నా మనోసాగరమందు నీవు విహరించకున్నచొ 
నా జీవితం దు:ఖ సాగరమవ్వదా అరుణాచల  

విసుగు చెంది నను విడిచినచో నా పూర్వ కర్మ ఫలం 
నను కాటు వేయకుండ విడుచునా అరుణాచల 

మౌనంగా వుండమని మౌనంగా చెపుతుంటివా 
దక్షిణామూర్తి స్వరూప అరుణాచల 

విషయ వాంఛల అనుభూతిలో  ఆలోచనలు ఆగినవేళ 
అర్ధవంతమైన ఆలొచనలొసగవయ్య అరుణాచల 

నేర్పున  నాలో మాయను చిదిమి 
నిమ్మళముగా నాలో నిలిచివుంటివా అరుణాచల 

యజమానిని విడువలేని కుక్క కన్నా హీనుడనా 
నా యజమానివైన నిన్ను పట్టలేకుంటిని అరుణాచల  

నిన్ను చేరు దారులు తెలియక అలసితినయ్య 
దారి చూపి అలసట తీర్చవయ్య అరుణాచల 

బ్రమరాన్ని చేరదీయు పూబాల హృదయం కన్నా 
మృదు మదుర హృదయంతో నా ముంగిట నిలిచితివా అరుణాచల 

నీ ఆత్మ స్వరూపమెరుగని అవివేకిని 
అంతటా నీవే నిండితివని నమ్మితినయా అరుణాచల 

నీవే నిత్యమని సత్యమని ఆత్మ స్వరూపమని 
నాకెరుక పరచవయ్య  అరుణాచల 

నాలొనికి తొంగి చూసిన నీ జాడ తెలియనగునని 
నా మదికి తెలియపరచతివో అరుణాచల 

నీ దయ తో నా అంతరంగాన దాగిన నిన్ను చూచితిని 
ఆత్మ జ్ఞాన  మీసమెత్తు లేకున్నను అరుణాచల 

నీ ఎరుక లేని జీవితం 
అడవి కాచిన వెన్నెల వలె వ్యర్ధమే కదా అరుణాచల 

నీలో మమేకమౌ పవిత్ర హృదయులు  నిన్ను చేరులోపు 
ఈ అపవిత్ర హృదయాన్ని నీలో కలుపుకో అరుణాచల 

దిక్కు తోచని నేను నీవే దిక్కని దరి చేరు వేళ 
దూరంగా త్రోసివేయుట భావ్యమా అరుణాచల 

సదా చలించు నా మనంబు సదా శివుడవైన 
నీపాదాలపై స్తిరీకరించు అరుణాచల 

నిన్ను తెలుసుకుని చేరవచ్చు సమయాన 
ఇంద్రియాలు నన్నోడిస్తున్నవి కావుమా అరుణాచల 

నీ పాద పద్మాల స్పర్స కోరి వికసించిన నా హృదయ పద్మం 
నీ తిరస్కార చూపులతో ముడుచుకున్న ఈ బ్రతుకెందులకయ్యా  అరుణాచల 

నా హృదయ పద్మమున నిలిచి ఆనంద తాండవమాడుతూ 
నన్నుద్దరించవయ్య కళ్యాణ గుణాభిరామ అరుణాచల 

నవ్వబోకు నిన్ను చేర వచ్చిన నన్ను చూసి జాలిగా 
దయ చూపి బ్రొచవయ్య ప్రేమగా అరుణాచల 

నీ కరుణ కోరి వచ్చు వేళ కట్టెవలె నిలవబొకు 
కరుణ చూపి కావుమయా అరుణాచల 

నీ  జ్ఞానాగ్ని నను దహించక ముందే 
నీ దయా వర్షం నా పై కురిపించుమా అరుణాచల 

నీవు నేనని భేదం చెరపి నేనే నీవని తెలపి 
నిత్య సంతోషిగా మార్చవయ్య అరుణాచల 

అసంబద్దమౌ ఆలోచనా తరంగాలను అణచి 
సత్యమౌ నీ రూపు నాలో నిలపవయ్య అరుణాచల 

విజ్ఞానినన్న బ్రాంతి రూపుమాపి సుజ్ఞాన జ్యోతులు 
వెలిగించవయ్య నా మదిలో అరుణాచల 

కట్టలు తెగిన భావావేశంతో నీలో కలసిపోవాలని నేనొస్తే 
నిర్మల హృదయంతో నిశ్చలంగా నిలిచివుంటివా అరుణాచల 

హితులెవ్వరు లేని ఆహితుడను నా హితము 
కోరి నను విడువబోకుమా అరుణాచల 

అపరిపక్వతతో నా మనఃఫలం నిష్ఫలం కానీయబోకు 
పరిపక్వతతో అపరిమితానందం కలిగించు అరుణాచల 

నా అన్న అహాన్ని అణచి నీ అన్న నిజాన్ని తెలిపి 
నను నీలో నిలుపుకోవయ్య అరుణాచల 

నాపై ఆలోచనలు నిలిపి నా వైపుకు చూపు చాపి నను తాకి 
నా జీవితాన్ని పండించి  పరిపాలించి నీలో కలుపుకోవయ్యా అరుణాచల 

మాయ అనే మధువు నను ముంచకమునుపె 
నీ దయ అనే వర్షం నాపై కురిపించు అరుణాచల 

నీకు నీవుగా నను కాచకున్న నను 
కాయమని నిను కొరువారెవరురా అరుణాచల 

ప్రాపంచిక సుఖాలకై వెంపర్లాడుతూ  వెదుకులాడుతున్న నన్ను 
నీ పాదాల వైపుకు పరుగులెట్టించవయ్యా అరుణాచల 

భయరహితుడా భయం వదలి నీలో కలువ నేనొస్తుంటే 
భయమెందులకు నీకు అరుణాచల 

మంచి చెడుల వివేచన నిచ్చి చెడును నిర్జించు 
స్తైర్యమీయవయ్య అరుణాచల 

విషయ వాసనలు త్యజించి నీపై దృష్టి నిలుపు 
పరిపూర్ణ జ్ఞానమొసగు  అరుణాచల 

నీ ఆలోచన నాలో కలిగిన కారణమే సాకుగా 
నను నీ వైపుకు త్రిప్పుకో అరుణాచల 

నీటిని విడచి నిలువజాలని చేపలా 
నీ స్మరణ మరచి మనలేను అరుణాచల 

వెలసిన వస్త్రం లా వెల వెల బోవురా  జీవితం 
 నీ వెన్ను దన్ను లేకున్న అరుణాచల 

నా  వూహకు  అందని వైభవముతో నా 
మిడి మిడి జ్ఞానం పటాపంచలు చేసితివిగా అరుణాచల 

ఆలుబిడ్డలను చింతలు మాపి అత్మానందపు 
అంచులు చూపవయ్యా అరుణాచల 

జనన మరణ చక్ర బ్రమణాలలో అనంత పయనం సాగించి 
అలసితిరా సేదతీర్చి ఆదుకో అరుణాచల 

అహాన్ని చిదిమి అణుకువ తో నీ దరి చేరు 
దారి చూపి బ్రొచవయా అరుణాచల 

అల్పుడను నా స్వల్ప  పూజలే 
అనల్పముగా దయ చూపవయ అరుణాచల 

చుక్కాని లేని నావలా అలల తాకిడికి అల్లల్లాడుతున్న 
నా జీవన నౌకను  భక్తి ని తెడ్డు చేసి తీరం చేర్చవయా అరుణాచల  

లోపాలను ఎంచబొకు హీనుడను నేను 
పసిపాపను పొత్తిళ్ళలో హత్తుకున్న అమ్మలా  హత్తుకో అరుణాచల 

దేహమే కైలాసము మనసే మానససరోవరంబు హృదయమే 
పద్మవనంబు చేసితి నాలో నివసించుమా అరుణాచల  

జ్ఞాన వైరాగ్యులే కాని కలిమి కలవారెవ్వరు నీ దరి లేరు 
అయినను నీ సరితూగు వారెవ్వరూ కీర్తిలో అరుణాచల 

నా అజ్ఞాన పొరలను దయా పూరిత దృక్కులతో తొలగించి 
నీ దగ్గరివాడిగా దరి చేర్చుకో అరుణాచల 

నే నా లనే ముళ్ళను తొలగించి పరుచుకున్న గులాబీ రెక్కల వంటి 
నా మానసమందు ఆనందతాండవ మాడుమా అరుణాచల 

నా పై మమకారం వదలి నీ పై అనురాగం కలిగించి 
పట్టిన నీ పాదాలెన్నటికి వీడనీవబోకు అరుణాచల 

రాతివలె ఉలకక పలకక నిలిచిననే యోగి యగునా 
నీ స్మరణ  లేక మదిలో అరుణాచల 

నాలోని అనుమానాలను దహించి 
తన దరికి చేర్చుకున్న దైవం నీవే కదా అరుణాచల 

నా దైవం నీవని   తలచి ఇంతా నీతో చెప్పితినయ్య 
తప్పులెన్నబొకు అరుణాచల 

పగలు రాత్రి తెలియని లోకంలో దివ్యానందపు 
మధురిమలు రుచి చూద్దాం రావయ్య అరుణాచల 

దయా శరములు  నాపై గుప్పించి కాయాన్ని కరుణతో 
కప్పి వేసి ఆత్మను నీలో లీనం చేసుకో అరుణాచల 

నీలో కలసి ఎనలేని లాభం పొందితినేను నను నీలో 
కలుపుకుని నీవు పొందేదేమున్నది అరుణాచల 

రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోతాను రా పో లకునడుమ 
సాగే పయనపు భారం నీదే అరుణాచల 

బ్రతుకు రణంలో అలసి మరణంలో విశ్రమించు వేళ 
నీ స్మరణం మరువనీకు అరుణాచల 

నా ను వదిలిన నా మనో మందిరంలో నీ పాద పద్మములు 
స్తిరముగా నిలుపుమా అరుణాచల 

వేదములను వేదాంత సారములను 
వివరించి మనో వేదన తీర్చుమా అరుణాచల 

నా పిచ్చి పలుకులనే స్తుతులుగా స్వీకరించు 
నా రక్షణ భారం వహించు అరుణాచల 

నీటిలో కరిగిపోయిన మంచు ముక్కలా నీ ప్రేమలో 
కరిగిపోనీ నను ప్రేమ స్వరూప అరుణాచల 

అరుణాచల అని తలచిన మాత్రమునే దయ అనే వలలో బంధించితివి 
ఎన్నటికి దయా భంధనాలు తెంచబొకు అరుణాచల 

సదా నీ సేవలో తరించు భక్తుని సేవకుడికి సేవకుడిగా 
 తరింప చేయుమా అరుణాచల 

నా వంటి నిర్భాగ్యుల పాలిట కామధేనువై 
మము కాపాడుమ అరుణాచల 

సజ్జనుల తేనే ధారల వంటి పలుకులలో తడిసి ముద్దయ్యే మహాదేవ 
ఈ అజ్ఞాని మొరటు మాటల కూర్పును కూడా ఆదరించుమా అరుణాచల 

ఓ దయాగిరి నా అవివేక పూరిత పలుకులనే సుమ హారాలుగా 
ధరించి అనుగ్రహించు అరుణాచల 
 
నా ఈ అక్షర సుమ మాల ను నీవు ధరించి 
నీ కరుణ వాత్సల్యాలనే సుమమాలను నా కొసగుమా అరుణాచల 
మహా జ్ఞాని భగవాన్ రమణుల అరుణాచల అక్షర మణిమాలకు ఓ అజ్ఞాని తెనిగింపు )