నారాయణా మీకు తెలియనిది ఏమున్నది
కాల స్వరూపులు , కర్మసాక్షి అయిన ప్రత్యక్ష సూర్యనారాయణులు
జీవిని బంధించు త్రిగుణ స్వరూపము మీరే
నరులను తమ చిత్తం వచ్చినట్లు ఆడించు మాయకు యజమానులు
మీకు తెలియని విషయమేమున్నది
అయినా మీ పాద పద్మముల చెంత నిలబడి నా వేదన విన్నవించుకుంటున్నాను
కొంచెం కరుణా స్వభావం తో వినండి
ఒక్కసారి నా జీవితాన్ని వెనుదిరిగి చూస్తే కాస్త లోకజ్ఞానం తెలసిననాటి నుండి నేటి వరకు నన్ను వీడక దహించి వేస్తున్న దావాగ్ని నుండి పుట్టిన కొన్ని ఫలాలు
తొలినాళ్ళలో మదురమైన ఊహలలో విహరింపజేసి నేడు సాధారణ దాహార్తి కూడా
తీర్చుకోవటానికి పనికిరాని ఎండమావుల పాల్జేసినావు
ఆనాడు దైవ సమానులైన గురువు పట్ల కూడని కార్యాన్ని చేయించి
నేడు ఆ కర్మ ఫలాన్ని బహు చక్కగా అనుభవింపచేస్తున్నావు .
నాకు తెలుసులే కృష్ణా నీకు అర్ధమయ్యిందని మరి వివరంగా చెప్పించాలనుకోకు
చదువును పక్కన పెట్టి పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసి నాడు సాగించిన ఘనకార్యపు ఫలితం నేడు నమ్మి చేయి పుచ్చుకున్నవారికి తీరని వేదనగా మారి పరిహాసించుచున్నది పరంధామా
పరమపవిత్రమైన ధామంలో నీ పాద పద్మముల చెంత కనులు ముసుకుపోయి ప్రవర్తించిన ఫలం నేడు నా జీవితాన్ని అపహాస్యం చేస్తున్నది కృష్ణా
ఏనాటి కర్మఫలమో నేడు ఇతరుల ధనం పట్ల తీరని ఆసక్తిని కలిగించి
అగ్ని చేత ఆకర్షించబడిన మిణుగురులు దహించుకుపోయినట్లుగా నా జీవితాన్ని
దగ్ధం చేస్తున్నది రామా
ఇంకా నాడు రైలు ప్రయాణంలో వృద్దుని పట్ల నా తీరు , తల్లి తండ్రుల పట్ల బాధ్యతారాహిత్య ప్రవర్తన
ఇవన్ని నారాయణా నీ కృపతో నే సంపాదించిన ఆస్తులు
ఇక చాలు చాలు ముకుంద వీటి భారమిక నే మోయలేను
నా ఆస్తులన్నిటిని సర్వ హక్కులతో నీకు ధారాదత్తం చేస్తున్నాను
బలి నుండి మూడడుగుల నేల కోరి తృప్తి పొందిన వామనా
నా ఈ కొద్దిపాటి ఆస్తులను కూడా ప్రేమతో స్వీకరించు
--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA