Thursday, August 13, 2009

భువన మోహన



భువన మోహన


ఆకాశం నుండి జాలు వారుచున్న పూల ధార వలె , శివుని వింటి నుండి దూసుకు వస్తున్న బాణ పరంపరవలె మదనుని చెరకు వింటిని తలపింపచేయు కనుబోమలతో అర్ధ నిమీలిత నేత్రాలనుండి ఎడతెరపి లేని , ప్రేమతో నిండిన , చీకట్లు తొలగితే తమను వీడిపోతాడన్న భయం తక్క మరే బెరుకు లేని నిశితమైన చూపులతో ఆ గోపకాంతలు ఆ జగన్మోహనా కారుడి సౌందర్య మధువును ఆస్వాదిస్తున్నారు . ఎర్రని దొండపండు వంటి , తేనెలూరు పెదవుల నుండి వెలువడుచున్న కాంతితో వెలుగుచున్న ఆ కృష్ణుని ముఖ సౌందర్యం చూపులను ప్రక్కకు తిప్పనీయకున్నది ఎర్ర తామర రెక్కలను పోలిన అరచేతులలో వున్న వేణువు , పెదవుల తీయదనాన్ని తన వేణుగాన తరంగాలలో నింపుకుని కర్ణ పుటాలను సోకి మనసులో మదుర భావనలు రేకెత్తిన్చుచున్నది గోపికల నుదుటి కుంకుమతో నిండిన కృష్ణుని దేహం అరుణ వర్ణపు భానుని వలె శోబిల్లుతుంది . భహుశా ఇట్టి లోకైక నిత్య సత్య సౌందర్యాన్ని చూచే కాబోలు రుక్మిణి ఇలా భావించింది .

ప్రాణేస ని మంజు భాషణలు వినలేని

రంద్రముల కలిమి యేల !

పురుష రత్నమా ! నీవు భోగింపగా లేని

తనులత వలని సౌందర్యమేల

మోహన ! నిన్ను పొడగానగా లేని

చక్షురింద్రియముల సత్వమేల !

దయిత ! ని యధరామృతం బానగా లేని

జిహ్వకు ఫల రస సిద్ది యేల !

నీరజాత నయన ! ని వనమాలికా

గంధ మబ్బలేని ఘ్రాణమేల !

ధన్య చరిత ! నీకు దాస్యంబు సేయని

జన్మ యేల ? ఎన్ని జన్మములకు ?

(పోతన భాగవతం )